ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ నేతలు.. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు వేంకటేశ్వర స్వామి ఆల యాల్లో `పాప ప్రక్షాళన` పేరిట ప్రత్యేక పూజలు చేపట్టారు. అయితే.. వాటికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ.. ప్రభుత్వం తమపై బురద జల్లుతోందని, తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రత కు భంగం వాటిల్లేలా చేస్తోందని ఆరోపిస్తూ.. వైసీపీ నాయకులు ఈ పూజలను కొనసాగించారు.
అసలేం జరిగింది?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏకంగా.. సనాతన దీక్ష చేపట్టారు. తాజాగా ఈ వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదికను ఇచ్చింది. దీనిలో జంతువుల కోవ్వుపై ఎలాంటి ప్రస్తావన లేదు. పైగా.. 10 శాతం లోపు జంతువు ల కొవ్వు కలిసినా.. తాము గుర్తించలేమని పేర్కొంది.
దీంతో వైసీపీ.. పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. తమపై కూటమి పాలకులు లేని పోని విమర్శలు చేశారని.. తిరుమల శ్రీవారి పవిత్రతతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ.. శనివారం... రాష్ట్రవ్యాప్తంగా పాప ప్రక్షాళన పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమం లోనే ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరులో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పచ్చిబూతులతో విరుచుకుపడ్డారు. మీడియాలో రాయలేని విధంగా ఆయన వ్యాఖ్యానించారు. ``ఏ నా కొడు....లు వస్తారో రండి.. కల్తీ ఎక్కడ జరిగిందో నిరూపించండి`` అని.. రాంబాబు రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబుపై కూడా ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ నాయకులు.. కూడా అంతే తీరుగా రియాక్ట్ అయ్యారు. అంబటిపై కర్రలు, రాడ్లతో దాడికి ప్రయత్నించారు. గోరంట్ల వైపు వెళ్తున్న టైంలో అక్కడ టీడీపీ నేతలు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అంబటిని అడ్డుకున్నారు.