ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా 3 కిలో మీటర్ల దూరం మేరకు సైకిల్ తొక్కారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత.. ఆయన సైకిల్ తొక్కడం గమనార్హం. అప్పట్లో పార్టీ పరాభవానికి గురైనప్పుడు.. అభిమాని ఒకరు కర్నూలులో సైకిల్ తీసుకువచ్చి.. ``ఈ సైకిల్ మళ్లీ పరుగులు పెడుతుంది`` అని వ్యా ఖ్యానించి.. అప్పట్లో చంద్రబాబుకు కానుకగా ఇచ్చారు. దీనిపై ఆయన రెండు రౌండ్లు వేశారు. ఆ తర్వాత.. మళ్లీ తాజాగా శనివారం సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు సైకిల్ తొక్కారు.
అయితే.. తాజాగా చంద్రబాబు తొక్కిన సైకిల్.. `ఈ-సైకిల్`. స్వయం సహాయక సంఘాలకు.. కుప్పం నియోజకవర్గంలో 5555 సైకిళ్లను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు స్వయంగా వాటిని లబ్ధిదారులైన మహిళలకు అందించారు. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు.. తొలుత ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం.. డ్వాక్రా మహిళలకు.. ఈ - సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన 3 కిలో మీటర్ల మేరకు.. సైకిల్ తొక్కారు.
కుప్పంలోని శివపురం నుంచి ప్రజావేదిక వరకు చంద్రబాబు సైకిల్ తొక్కుతూ వచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గంలో నూతన చరిత్రను సృష్టించామ న్నారు. 5555 ఈ-సైకిళ్లను మహిళలకు పంపిణీ చేయడం ఒక చరిత్రగా ఆయన అభివర్ణించారు. ``గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.`` అని తెలిపారు. సైకిల్‌కు అవసరమయ్యే విద్యుత్‌ను ఇంట్లోనే ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సహించనున్నట్టు చెప్పారు.
``సైకిల్‌కు ఓటేశారు.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇదిలావుంటే.. 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ నేపథ్యంలో దీనిని గిన్నిస్ రికార్డు ప్రతినిధులు రికార్డు చేశారు. అనంతరం గిన్నిస్ రికార్డు పత్రాన్ని సీఎం చంద్రబాబుకు ఇచ్చారు.