మాజీ సీఎం జగన్ తన హయాంలో ఏపీ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ఐదేళ్లు అహర్నిశలు శ్రమిస్తే…సీఎంగా పగ్గాలు చేపట్టి ఏడాది తిరక్కముందే చంద్రబాబు అమరావతి పునర్నర్మాణ పనులను జెట్ స్పీడ్ తో పట్టాలెక్కించారు. ఓ వైపు అమరావతి నిర్మాణం కోసం నిధుల కోసం ప్రయత్నిస్తూ..మరోవైపు అమరావతిలో పెట్టుబడుల కోసం దావోస్ లో కంటిమీద కునుకు లేకుండా బిజీగా ఉన్నారు చంద్రబాబు.
ఈ క్రమంలోనే చంద్రబాబు కష్టం ఫలించింది. అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధుల విడుదలకు హడ్కో అంగీకరించింది. అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని, తాజాగా హడ్కో తీసుకున్న నిర్ణయంతో అమరావతి పనులు వేగవంతమవుతాయని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
వాస్తవానికి గత ఏడాది అక్టోబరులో అమరావతికి హడ్కో కేటాయించిన రూ.11 వేల కోట్ల నిధుల విడుదల గురించి హడ్కో సీఎండీ సంజయ్ కుల శ్రేష్టతో నారాయణ భేటీ అయ్యారు. హడ్కో నుంచి రుణం పొందేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, నిధుల వినియోగం గురించి వివరించారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఆ నిధుల విడుదలకు ఆమోదం లభించింది. ఈ నిధులతో అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి కాబోతున్నాయని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.