వైసీపీ అధినేత జగన్.. ఏపీ రాజధాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నాయకుడు .. దెందులూరు ఎమ్మెల్యే.. చింతమనేని ప్రభాకర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. "ఆనాడు 32వేల ఎకరా లు అమరావతి రాజధానికి అవసరం అని చెప్పిన జగన్, ఈనాడు మళ్ళీ మావిగన్, పెంటగాన్, మిచిగాన్ అనటం చూస్తుంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు అనుమానంగా ఉంది.`` అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. జగన్.. ఒకసారి వైద్యుల్ని కలిసి పరీక్షించుకుంటే మంచిదని చింతమనేని సూచించారు. అమరావతి రాజధానికి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని స్వయంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి గ్రామస్థులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.
చింతమనేని మాట్లాడుతూ "ఆంధ్రుల కలల రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో గర్వకారణం. ఇందుకోసం ఎంతగానో కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు, బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా`` అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 32 రూపాయలు కూడా తీసుకోకుండా 32వేల ఎకరాలను అందించిన అమరావతి రైతుల త్యాగాలకు ఈ చట్టబద్ధత ఒక గుర్తింపును భరోసాను తెచ్చిందన్నారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి జగన్ మూడు ముక్కలాట ఆడి రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారని, ఈనాడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరిగి రాష్ట్ర అభివృద్ధి సమగ్ర దిశగా నడుస్తుంటే చూసి ఓర్వలేక అమరావతి చట్టబద్ధత లభించడం వల్ల సహించలేక జగన్ మానసిక వైకల్యానికి గురై మావిగన్, పెంటగాన్, మిచిగాన్ అంటూ ఏవేవో పిచ్చిప్రేలాపనలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఒకసారి మానసిక వైద్యులకు చూపించి పరీక్షలు చేయించుకోవడం జగన్కు ఎంతో ఉత్తమమని చింతమనేని వ్యాఖ్యానించారు. ఇక కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఏ దుష్టశక్తులు కూడా ఆపలేవన్నారు. రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసి రాజధానిపై విషం కక్కిన వైసీపీ నాయకులకు ఈసారి ప్రజలు ఆ 11 సీట్లు కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.