వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, తనపై ఎవరి ఒత్తిడి లేదని విజయ సాయి రెడ్డి వెల్లడించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, వేరే ఏ పదవులు ఆశించడం లేదని ఆయన క్లారిటీనిచ్చారు.
ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా వైఎస్ కుటుంబం తనను ఆదరిస్తూ వచ్చిందని చెప్పుకొచ్చారు. తనను రెండుసార్లు రాజ్యసభకు పంపించిన మాజీ సీఎం వైఎస్ జగన్ కు , ఆయన సతీమణి వైఎస్ భారతికి రుణపడి ఉంటారని విజయసాయి అన్నారు.
జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.