వై.ఎస్. జగన్ సొంత బాబాయ్ వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య ఇప్పటికీ మిస్టరీనే. ఏళ్లు గడుస్తున్నా, సీబీఐ రంగంలోకి దిగినా వివేకా మరణం వెనుకున్న రహస్యాలు మాత్రం వెలుగులోకి రావడం లేదు. మొదట అందరూ ఆయనది సహజ మరణం అనుకున్నారు. వైసీపీ కీలక నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్లు మీడియాకు తెలిపారు. కానీ వివేకా ఒంటిపై రక్తపు మరకలు ఉండటంతో.. హత్య చేసి చంపారన్న విషయం బయటపడింది. దాంతో ఆయన కూతురు సునీత రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. కానీ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంత వరకు ఓ కొలిక్కి రాలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా వివేకా మరణంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే.శనివారం ఉదయం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ కి అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. రాజకీయాలు వదిలేయడం, పార్టీకి మరియు ఎంపీ పదవికి రాజీనామా చేయడం పూర్తిగా తన వ్యక్తిగతమని.. పదవుల కోసమో, కేసుల మాఫీ కోసమో కాదని స్పష్టం చేశారు. జగన్ తో అన్ని మాట్లాడాకే రాజీనామా చేశానన్నారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనన్నారు.
దైవాన్ని నమ్మే వ్యక్తిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తనకు తెలియదని విజయసాయి రెడ్డి అనడంతో.. వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు అబద్ధం చెప్పారని మీడియా ప్రశ్నించింది. అందుకు బదులిస్తూ.. నిజానికి వివేకానందరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే ఆశ్చర్యపోయానన్నారు. వెంటనే పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డికి ఫోన్ చేయగా.. ఆయన తన పక్కన ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారు. అతనే గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారన్న విషయాన్ని తనకు చెప్పారని, అదే సమాచారాన్ని మీడియాకు తెలియజేశానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.