రాష్ట్రంలో నెలకొన్న పెట్రోలు, డీజిల్ కొరత, పెట్రోలు బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు.. సోమవా రం దాదాపు అన్ని పత్రికల్లోనూ వచ్చిన పతాక శీర్షికలు ఇవే. ఆ వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. తొలుత అధికారులతోను.. తర్వాత.. పెట్రోల్ బంకుల యజమానులతోనూ ఆయన వరుసగా 4 గంటలకుపైగానే.. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రెండు సందర్భాల్లోనూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కొరడా తీయమంటారా... కదులుతారా? అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై వివరణ కోరారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.
కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతి 3 గంటల కు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అదేసమయంలో మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు స్పందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలన్నారు. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలని ఆదేశించారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు బంకుల వంద వాహనదారులు బారులు తీరడం.. మరోవైపు వడగాడ్పులు, వేసవి తీవ్రత పెరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.