ధనుష్(Dhanush)ను చూసి ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇతనేం హీరో అనుకున్నారు. కానీ రఘువరన్ బీటెక్‌గా అనువాదం అయిన వీఐపీ సినిమా చూశాక తన టాలెంట్ ఏంటో మన వాళ్లకు అర్థమైంది. ఇక అప్పట్నుంచి వరుసగా తన చిత్రాలు తెలుగులో రిలీజవుతున్నాయి. తమిళంలో హిట్టయ్యే తన చిత్రాలు.. తెలుగులోనూ బాగానే ఆడుతున్నాయి. ఇప్పుడతను కర(kara movie) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 30న ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరికి, ధనుష్‌కు మధ్య సాగిన గిల్లికజ్జాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ధనుష్‌తో వెంకీ సార్ లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన సంగతి తెలిసిందే. ధనుష్‌కు తెలుగులో ఫాలోయింగ్ పెంచిన సినిమా ఇది. సార్ తర్వాత వెంకీ తీసిన లక్కీ భాస్కర్ కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు వెంకీ.. మరో తమిళ స్టార్ సూర్యతో సినిమా చేస్తున్నాడు.
ఐతే నటుడిగా అదరగొడుతూనే, దర్శకుడిగానూ ఘనవిజయాలు అందుకుంటున్న నేపథ్యంలో ధనుష్‌ను వెంకీ కొనియాడే ప్రయత్నం చేయగా.. ధనుష్ భలే ఫన్నీగా స్పందించాడు. మీ టాలెంట్‌లో పది శాతం మాకు వచ్చినా బాగుంటుందని మేం అనుకుంటాం అని వెంకీ వ్యాఖ్యానించగా.. ఈయన వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు, ఇంకో పెద్ద సినిమా చేస్తున్నాడు, అలాంటిది నా టాలెంట్‌లో కొంచెం కావాలట అంటూ కామెడీ చేశాడు ధనుష్. అంతటితో ఆగకుండా.. నువ్వు డైరెక్షన్ మాత్రమే చెయ్యిబాబూ, యాక్టింగ్ మాకు వదిలేసేయి, మేం చూసుకుంటాం అంటూ వెంకీని ఆట పట్టించాడు ధనుష్. తర్వాత వీరి సంభాషణ మామూలుగా సాగింది. 45 రోజుల్లో ఒక సినిమాను డైరెక్ట్ చేసి ఎలా బ్లాక్ బస్టర్ కొట్టారు అంటూ ఇడ్లీ కొట్టు సినిమా ప్రస్తావన తెచ్చాడు వెంకీ. ఐతే దర్శకుడిగా తన పాత్ర కీలకమే అయినా.. టీంలో అందరూ కష్టపడితేనే ఒక సినిమా సక్సెస్ అవుతుందని, కాబట్టి సక్సెస్ క్రెడిట్ అందరికీ ఇవ్వాలని ధనుష్ అభిప్రాయపడ్డాడు.