పెద్ది నిర్మాత సేఫ్ అయ్యాడా?

admin
Published by Admin — June 29, 2026 in Movies
News Image

తొలి సినిమానే రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్‌తో చేయడం ఏ నిర్మాతకైనా అదృష్టమే. పలు వ్యాపారాలున్న వృద్ధి గ్రూప్ అధినేత సతీష్ కిలారుకు ఈ అదృష్టమే దక్కింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ హీరోగా ఆయన నిర్మించిన ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందు బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. నిర్మాత లెక్క ప్రకారం ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్ పెట్టారీ చిత్రం మీద. అయినా సరే బిజినెస్ గట్టిగానే జరిగింది. 

దీనికి తోడు సినిమాకు తిరుగులేని హైప్ క్రియేట్ అవడం.. భారీ ఓపెనింగ్స్ కూడా రావడంతో నిర్మాత మంచి లాభాలే అందుకుంటాడన్న అంచనాలు కలిగాయి. కానీ చివరికి చూస్తే నిర్మాతకు ఏమీ మిగలకపోగా.. కొంతమేర నష్టాలు కూడా తప్పలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. సినిమాను అమ్మేశాం అని నిర్మాత చేతులు దులుపుకోకుండా ఎక్కువ నష్టాలు వచ్చిన చోట సెటిల్ చేస్తుండడంతో చివరికి ఆయనకు నష్టం తప్పట్లేదని సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ ‘పెద్ది’ బ్రేక్ ఈవెన్ అయింది. కొన్ని చోట్ల స్వల్ప లాభాలు వచ్చాయి. మిగతా చోట్ల పెట్టుబడి రికవరీ అయింది. ఎక్కడైనా నష్టాలున్నా అది స్వల్పమే. కానీ తెలుగు రాష్ట్రాల అవతల ‘పెద్ది’ ఎక్కడా బ్రేక్ ఈవెన్ కాలేదు. కర్ణాటకలో భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. రికవరీ 70-80 శాతం మధ్యే ఉన్నట్లు సమాాచారం. హిందీలో జియో సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. వాళ్లు రూ.40 కోట్ల దాకా చెల్లించారు. లాభం వస్తే ఓకే.. లేదంటే ఎంత నష్టం వాటిల్లితే అంత వెనక్కి ఇవ్వాలనే షరతు మీద జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. 

‘పెద్ది’ హిందీ షేర్ రూ.10 కోట్లకు మించి ఉండకపోవచ్చని అంచనా. కాబట్టి పెద్ద మొత్తంలోనే వెనక్కి ఇవ్వాల్సి ఉంది. ఇక ఓవర్సీస్‌లో పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాలేదు. దీంతో అక్కడా సెటిల్మెంట్ చేయాల్సి ఉంది. ఈ చెల్లింపులన్నీ అయ్యాక చూసుకుంటే.. నిర్మాతకు ఏం మిగులుతుందన్నది ప్రశ్న. పేరుకు బడ్జెట్ రూ.350 కోట్లని అంటున్నా.. అంత ఉండకపోవచ్చని, ఖర్చు రూ.300 కోట్ల లోపే ఉంటుందని.. ఓటీటీ సంస్థ ముందు చెప్పిన రేటుకు కట్టుబడితే నిర్మాత బ్రేక్ ఈవెన్ అవుతాడని.. ఒకవేళ ముందు చెప్పిన రూ.110 కోట్ల మీద ఎంత తగ్గిస్తే అంత ప్రొడ్యూసర్‌కు నష్టమే అని సమాచారం.

Tags
Peddi movie producer safe
Recent Comments
Leave a Comment

Related News