వయసు గురించి వచ్చిన ప్రతి సందర్భంలో ఇంగ్లిషులో తరచూ చెప్పే మాట.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని. తెలుగులో చెప్పాలంటే.. ‘వయసు ఒక అంకె మాత్రమేనని’. చాలామంది ఒప్పుకోరు.. కానీ అది నిజం. అయితే.. చాలా తక్కువమంది ఆ మాటలో నిజముందన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. శతాధిక పెద్దావిడ (ఆమెను పెద్దవయస్కురాలిగానే చెబుదాం. ఎందుకంటే.. ముసలావిడ అని చెప్పి అవమానించటం ఇష్టం లేదు) ఒకరు తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల(Tirumala) కొండను ఎక్కేసిన వైనం సోషల్ మీడియాలో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
కర్ణాటక(Karnataka)కు చెందిన 116 ఏళ్ల పెద్దావిడ.. అడుగులో అడుగు వేసుకుంటూ అలిపిరి మార్గంలో 3500 మెట్లు.. పదకొండు కిలోమీటర్ల దూరాన్ని నడిచేసిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఒక యువతి పోస్టు చేయటంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వయసులో ఇన్ని మెట్లు ఎక్కటమా? అంటూ కొందరు విస్మయాన్ని వ్యక్తం చేస్తుంటూ.. ఇది శ్రీవారి మహిమే అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి అలిపిరి(Alipiri) మార్గంలో తిరుమల చేరేందుకు వయసులో ఉన్న వారు ఐదారు గంటల సమయాన్ని తీసుకుంటారు. దీనికి వారు విపరీతమైన అలసటకు గురవుతారు. అలాంటిది 116 ఏళ్ల వయసులో అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటం సామాన్యమైన విషయం కాదు. అయితే.. ఈ భక్తురాలి పేరు.. ఆమె ఏ ప్రాంతానికి చెందిన వారన్న విషయంపైన మాత్రం వివరాలు బయటకు రాలేదు. చిన్న సంచి చేతపట్టుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ.. తిరుమల కొండకు చేరుకున్నారు. ఈమె ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుందని మాత్రం చెప్పకతప్పదు.