ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో, శాసనమండలిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు మండలిలో మెజారిటీతో చక్రం తిప్పిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. వైసీపీకి చెందిన ఇద్దరు కీలక సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో.. ఆ స్థానాలను కైవసం చేసుకునేందుకు కూటమి సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానంతో పాటు సీనియర్ నేత, ఎమ్మెల్సీ రవీంద్రబాబు త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. వైసీపీ(YCP)కి చెందిన వీరిద్దరి రిటైర్మెంట్‌తో ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థానాల్లో కూటమి తరఫున బరిలోకి దిగే ఆ ఇద్దరు అభ్యర్థుల పేర్లు కూడా దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో.. ఒక స్థానం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ వాయిస్ బలంగా వినిపించే వర్ల రామయ్య(Varla Ramaiah)కు దక్కడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం పని చేస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గట్టిగా నిలబడిన వర్ల రామయ్యకు ఈసారి మండలి పదవి ఇవ్వడం ద్వారా సరైన గుర్తింపు లభిస్తుందని పార్టీ భావిస్తోంది. ఇక రాయలసీమ ప్రాంత సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ రెండో స్థానాన్ని రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డికి కేటాయించినట్లు సమాచారం. సీమ రాజకీయాల్లో మంచి పట్టున్న శ్రీనివాసుల రెడ్డి పేరును ఖరారు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో కూటమి మరింత బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.