ఏపీకి పెట్టుబడుల వేటలో మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో కొరియా పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రత్యేక సెంటర్ ను లోకేశ్ ప్రారంభించారు. బుసాన్‌లో ఏపీఈడీపీ ఆధ్వర్యంలో ‘అపెక్స్ కొరియా’ పేరిట ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సహాయ, అనుసంధాన కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న కొరియా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇది వారధిలా వ్యవహరిస్తుందని లోకేశ్ తెలిపారు. ఆల్రెడీ ఏపీలో ఏర్పాటైన సంస్థలకు కూడా అవసరమైన సేవలు అపెక్స్ కొరియా అందిస్తుందని చెప్పారు. మారిటైమ్ వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్ అత్యం అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను లోకేశ్ ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే బుసాన్ కు రైల్లో ప్రయాణించిన లోకేశ్...అక్కడ ఉన్న ప్రముఖ షూ ఆల్స్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్‌ను తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. రక్త ప్రసరణను మెరుగుపరచడం, కండరాల అలసటను తగ్గించడం కోసం మాగ్నెటిక్ జనరేటర్లు, ప్రత్యేక చిప్‌లతో బూట్లను తయారు చేసే విధానాన్ని లోకేశ్ అడిగి తెలుసుకున్నారు.
నడకలో అసౌకర్యాన్ని తగ్గించి పాదాలను ఆరోగ్యంగా ఉంచేందుకు మెడిచియో వైబ్రేషన్ చిప్‌లను బూట్లలో అమర్చే ప్రక్రియను కూడా పరిశీలించారు. మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్జార్‌ప్షన్, కూలింగ్ సోల్స్, యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్‌ను కలిపి ఎంఎఫ్‌డీఎస్ సర్టిఫైడ్ మెడికల్ ఫుట్‌వేర్‌ను తయారు చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు లోకేశ్ కు తెలిపారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌తో కలిసి ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామని వారు వెల్లడించారు.