సినిమా ఫలితం కొంచెం అటు ఇటు అయితే రివ్యూయర్లను నిందించడం ఫిలిం మేకర్స్‌కు అలవాటే. గత శుక్రవారం రిలీజై మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకున్న నాగబంధం సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. దర్శకుడు అభిషేక్ నామా.. రివ్యూలను తప్పుబట్టాడు. పెయిడ్ రివ్యూలతో ఈ సినిమాను దెబ్బ తీసే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించాడు.
నాగబంధం సినిమా రిలీజైంది జులై 4న అని, ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వేశామని.. కానీ 2వ తారీఖునే ఈ చిత్రం బాలేదంటూ రివ్యూలు బయటికి వచ్చాయని.. అసలు రిలీజే కాని సినిమాకు ముందే ఎలా రివ్యూలు ఇస్తారో చెప్పాలని అభిషేక్ ప్రశ్నించాడు.
ప్రేక్షకులు పెయిడ్ రివ్యూలను పట్టింంచుకోకుండా సినిమాకు వెళ్లి చూసి, ఒరిజినల్ రివ్యూలు ఇవ్వాలని ఆయన కోరాడు. ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతోందని, చూసిన వాళ్లందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఆయనన్నాడు. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్‌ను అనుసరించే ఈ సినిమాను ట్రిమ్ చేసినట్లు అభిషేక్ వెల్లడించాడు. రన్ టైం ఎక్కువుందని అన్నారని.. ఫస్టాఫ్‌లో పాట అడ్డుగా ఉందని చెప్పడంతో దాన్ని తీసేశామని.. అలాగే క్లైమాక్స్ ఫైట్ లెంగ్తీగా ఉందంటే దాన్నీ తగ్గించామని అభిషేక్ తెలిపాడు. ఈ సినిమాలో తాము చూపించింది కల్పిత కథ కాదని.. చరిత్రలో జరిగిందే చూపించామని అభిషేక్ తెలిపాడు.
17వ శతాబ్దంలో అఫ్గాన్ నుంచి ముస్లిం రాజులు వచ్చి.. మధురైలోని ఆలయాల మీద పాశవికంగా దాడి చేసి, అనేక మంది హిందువులను చంపారని.. వాస్తవంగా జరిగిన దాంట్లో తాను చూపించింది పది శాతమే అని.. మన హిందువులకు జరిగిన అన్యాయం గురించి చరిత్ర చదివితే తెలుస్తుందని.. ఈ సినిమా చూసి కూడా ఆ విషయాలు తెలుసుకోవచ్చని అభిషేక్ అన్నాడు. ఈ సినిమా కోసం ఎంతోమంది రేయింబవళ్లు రెండున్నరేళ్ల పాటు కష్టపడ్డారని.. కొత్త నిర్మాతలు రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టి సినిమాను నిర్మించారని.. వీళ్లందరి కష్టాన్ని గుర్తించి ప్రేక్షకులు ఈ సినిమాను సపోర్ట్ చేయాలని అభిషేక్ కోరాడు.