అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి(Ex MLA Thopudurthi Prakash Reddy) అరెస్టుతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య నడుస్తున్న సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. అసలేం జరిగిందంటే..
మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు(MLA MS Raju), మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిల మధ్య గత కొంతకాలంగా ఆస్తులు, అవినీతి ఆరోపణలపై తీవ్రస్థాయిలో వాగ్వాదం నడుస్తోంది. ఇరు నేతలూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలోనే, తోపుదుర్తి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో ఆయన ఇంటి ముట్టడికి వెనుకాడబోమని ఎమ్మెల్యే రాజు హెచ్చరించారు. ఈ ప్రశ్నలకు, సవాళ్లకు సమాధానం ఇచ్చేందుకు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సిద్ధమయ్యారు. అయితే, ఆయన ఎమ్మెల్యే రాజును కలవడానికి బయలుదేరుతున్న సమయంలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు.
అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని పోలీసులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు. ఆయన సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ(YCP) కార్యకర్తలు, అనుచరులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, అనంతపురం(Anantapur) జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ కాకపుట్టిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పరిటాల వర్సెస్ తోపుదుర్తి కుటుంబాల మధ్య దీర్ఘకాలిక వైరం ఉంది. 2019 ఎన్నికల్లో పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు. అయితే, 2024 ఎన్నికల్లో తోపుదుర్తి ఓటమి పాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. కేవలం ఈ సవాళ్లే కాకుండా, తోపుదుర్తి కుటుంబం చుట్టూ ఇళ్ల నిర్మాణం స్కామ్ ఆరోపణలు, ఇతర కేసులు కూడా ఉన్నాయి. గతంలో తోపుదుర్తి సోదరులు రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలను కూడా ఒక యువకుడి ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ప్రకాశ్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం గమనార్హం.