తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇప్పటివరకు ప్రతిపక్షాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఆరోపణలను, ఇప్పుడు ఏకంగా ఇంటి మనిషే రచ్చకీడ్చడం గులాబీ పార్టీలో మునుపెన్నడూ లేని అలజడిని సృష్టించింది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha).. బీఆర్ఎస్ పార్టీ ఫండ్స్ వెనుక ఉన్న అసలు గుట్టును సింగరేణి బొగ్గు గనుల సాక్షిగా బట్టబయలు చేసేశారు. బీఆర్ఎస్ బ్యాంక్ ఖాతాల్లో అధికారికంగా ఉన్న రూ. 1400 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆమె విసిరిన పొలిటికల్ బాంబ్, ఇప్పుడు ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఊపిరి ఆడకుండా చేస్తోంది.
గత పదేళ్ల పాలనలో గులాబీ పార్టీ దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా అవతరించడం వెనుక ఉన్నది లింక్డ్ డీల్స్ అనే కఠిన సత్యాన్ని కవిత మీడియా ముందు పెట్టారు. తెలంగాణకు చెందిన కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు, విలువైన సహజ వనరులను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బడా కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టారని, దానికి బదులుగానే ఈ రూ. 1400 కోట్ల భారీ నిధులు పార్టీ ఫండ్ రూపంలో జమయ్యాయని ఆమె కుండబద్దలు కొట్టారు. ఈ మొత్తం చీకటి ఒప్పందాల వెనుక కేటీఆర్(KTR), హరీష్ రావుల హస్తం ఉందంటూ నేరుగా బాణాలు ఎక్కుపెట్టడం ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదంలో కవిత కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(KCR)ను ఇరకాటంలో పెట్టేలా ఒక పెద్ద డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఆ అక్రమ సొమ్ముతో పార్టీ లగ్జరీలు అనుభవించడం కాదని.. స్వరాష్ట్రం కోసం బలిదానాలు చేసుకుని, నేటికీ ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మలిదశ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఆ 1400 కోట్లను సమానంగా పంచాలని అల్టిమేటం జారీ చేశారు. త్యాగాల పునాదుల మీద నిలబడిన పార్టీ, కాంట్రాక్టర్ల సొమ్ముతో విమానాల్లో తిరగడం ఏంటనే రీతిలో కవిత వేసిన ప్రశ్నలు కేసీఆర్‌ను తీవ్ర డిఫెన్స్‌లోకి నెట్టేసాయి.
మళ్లీ తెలంగాణ(Telangana) సెంటిమెంట్‌ను నమ్ముకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్‌కు, కవిత చేసిన వ్యాఖ్యలు కోలుకోలేని పెద్ద దెబ్బ. తెలంగాణ సంపదను పక్క రాష్ట్ర వలస కాంట్రాక్టర్లకు దోచిపెట్టారనే ముద్ర సొంత లీడర్ ద్వారానే పడటంతో, దీనికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక గులాబీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు.