ప్రముఖ గాయని, 'దక్షిణ భారత గాన కోకిల' ఎస్.జానకి (శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి) కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకి(88) శనివారం మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 6 దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించిన జానకి ఇకలేరు అన్న వార్తతో భారతీయ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. జానకి మృతి పట్ల ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శిష్ట్లా శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జానకి జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులోనే తొలిసారి వేదికపై పాడి తన ప్రతిభను చాటుకున్నారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలైయాట్టు'తో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేశారు.
60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20 భారతీయ భాషల్లో, అలాగే ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ వంటి విదేశీ భాషల్లో కలిపి మొత్తం 48,000కు పైగా పాటలను రికార్డ్ చేశారు.
'క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ మాడ్యులేషన్' గా బిరుదు పొందిన జానకికి 4 జాతీయ పురస్కారాలు, 33 రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించగా...మైసూరు విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 2013లో 'పద్మభూషణ్' పురస్కారానికి ఎంపిక చేసినా సున్నితంగా తిరస్కరించారు. 'భారతరత్న' రావాలని భావిస్తున్న జానకి ఆ పురస్కారాన్ని రిజెక్ట్ చేశారు.
1959లో వి. రామ్‌ప్రసాద్‌ను వివాహం చేసుకున్న జానకికి ఒక కుమారుడు మురళీ కృష్ణ ఉన్నారు. భర్త రామ్‌ప్రసాద్ 1997లో గుండెపోటుతో మరణించగా..2026 జనవరిలో మురళీకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు.