'నీట్' రచ్చపై పవన్ ఫైర్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్..!

admin
Published by Admin — July 24, 2026 in Politics, National
News Image

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' (NEET) పరీక్షల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా గళం విప్పారు. విద్యార్థుల ఆవేదన పట్ల తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తూనే, ఈ ఉద్యమం ముసుగులో చెలరేగుతున్న అరాచక శక్తులపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల న్యాయమైన పోరాటాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం మొదలైన ఈ ఆందోళనలు ఇప్పుడు దారి తప్పాయని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన నిరసనలను కొందరు ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మారుస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా, కొన్ని విభజనవాద, దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి డిమాండ్లను వినేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉందని పవన్(Pawan) గుర్తుచేశారు. విద్యార్థుల శాంతియుత నిరసనలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ఆందోళనల పేరుతో రోడ్లెక్కి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ నినాదాలు చేయడం, మత విశ్వాసాలను కించపరచడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే శక్తులకు ఇది తన కఠిన హెచ్చరిక అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం (NEP) ప్రాముఖ్యతను పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు. ఎన్‌ఈపీ అమలులోకి వస్తే దేశ విద్యావ్యవస్థలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన లోపాలు తొలగిపోయి, సమూల మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ నూతన విద్యా సంస్కరణలను సానుకూల దృక్పథంతో స్వీకరించాలని సూచించారు. ఇక హక్కుల కోసం పోరాడే క్రమంలో బాధ్యతలను విస్మరించకూడదని పవన్ హితవు పలికారు. ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో ‘నేషన్ ఫస్ట్’  అనే భావన బలంగా నాటుకుపోవాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు.

 

Tags
Pawan Kalyan NEET NEET Protests Nation First JanaSena Andhra Pradesh PM Modi NEET 2026
Recent Comments
Leave a Comment

Related News