ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు చెబితేనే ఒక ఫైర్. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలో, విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో ఆమె స్టైలే వేరు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా, మంత్రిగా ఒక వెలుగు వెలిగిన ఆర్కే రోజా(RK Roja).. ఇప్పుడు అనూహ్యంగా సైలెంట్ అయిపోయారు. 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి గాలి భాను ప్రకాష్ చేతిలో 40 వేల భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఆమె రాజకీయంగా ఎక్కడా యాక్టివ్‌గా కనిపించడం లేదు. వైసీపీ అధినేత జగన్, ఇతర మాజీ మంత్రులు కూటమి ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తూ, విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. రోజా మాత్రం గప్‌చుప్‌గా ఉండిపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న రోజా.. తన పాత ప్రపంచమైన వినోద రంగానికి మళ్లీ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమె తన మకాంను పూర్తిగా చెన్నైకి మార్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వడంతో పాటు, కోలీవుడ్(Kollywood)లో ఓ సినిమా కూడా చేశారు. ఆమె నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజకీయాల్లో ఎదురైన పరాజయం, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకే ఆమె వెండితెర, బుల్లితెరలను నమ్ముకుని సేఫ్ జోన్లో కాలం గడుపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, రోజా సైలెంట్ అవ్వడానికి కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కారణం కాదని వైసీపీ(YCP) వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆమె క్రీడల మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం ఇప్పుడు డేగకన్ను వేసింది. ఈ సమయంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తే లేనిపోని కేసులు, చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ముందుచూపుతోనే ఆమె వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని టాక్. దీనికి తోడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న విభేదాలు, నగరిలో సొంత పార్టీ నేతల మధ్యే ఉన్న తీవ్రమైన వర్గపోరు కూడా రోజాను రాజకీయాలకు దూరం చేస్తున్నాయని టాక్.
మరోవైపు, నగరి నియోజకవర్గం విషయంలో వైసీపీ అధిష్టానం కూడా కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడుసార్లు రోజాకు అవకాశం ఇచ్చిన జగన్(Jagan).. రాబోయే రోజుల్లో అక్కడ ఒక బలమైన స్థానిక బీసీ నేతను బరిలోకి దించాలని యోచిస్తున్నారట. తద్వారా గాలి కుటుంబానికి చెక్ పెట్టాలన్నది వైసీపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడితే భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రోజాకు అధిష్టానం నుంచి హామీ ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికైతే నగరిలో ఆమె హవాకు బ్రేకులు పడినట్లేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.