బాధితుడిని వదిలేసి.. నిందితుడికి ప‌ర‌మ‌ర్శేంటి జ‌గ‌న్‌.?

admin
Published by Admin — July 30, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో వ్యూహాలు వేయడం, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడం సహజం. కానీ, ఒక వైపు నిరుపేద కుటుంబంలో విషాదం అలుముకుంటే పట్టించుకోని నేతలు.. మరోవైపు చట్టాన్ని ధిక్కరించి జైలుపాలైన వ్యక్తిని పరామర్శించడానికి హుటాహుటిన వెళ్లడం ఏ రాజకీయ సంస్కృతికి నిదర్శనం? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ప్రశ్న తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలిని ‘హిట్ అండ్ రన్’గా అభివర్ణించినా, నేడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది కేవలం పారిపోవడం మాత్రమే కాదని, వివాదాలను వెతుక్కుంటూ వెళ్లే సరికొత్త పరామర్శ రాజకీయంలా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంలో జైలుపాలైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) విశాఖలో అడుగుపెట్టడం, అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో శ్రీకాకుళం బయలుదేరడం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందంటూ సాకులతో రాజకీయం రంజుగా మార్చడానికి వైసీపీ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జైలు గడప తొక్కిన మాజీ మంత్రిని పరామర్శించి బయటకు రాగానే, ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు బలమైన స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది.

అయితే, ఇక్కడే అసలు నైతిక సమస్య తెరపైకి వస్తోంది. సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju) కుమారుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పేద గొర్రెల కాపరి దానయ్య కుటుంబం గురించి ఎవరైనా ఆలోచించారా? ఒక అధికార పార్టీ నేత లేదా ఆయన కుటుంబ సభ్యుల వల్ల ప్రాణం పోతే, అదే ఆవేదనతో ఉన్న బాధితుల కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ ఎందుకు వెళ్లలేదు? న్యాయం కోసం రోడ్డెక్కిన నిరుపేద కుటుంబానికి అండగా నిలవాల్సిన మాజీ ముఖ్యమంత్రి, నిందితుడిని వెకేషన్‌కు వెళ్లినట్లు పరామర్శించడానికి ప్రాధాన్యత ఇవ్వడం ఏ పద్ధతి?

ఇదిలా ఉంటే, సరిగ్గా మరో 48 గంటల్లో ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన‌ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram Airport) అత్యంత అట్టహాసంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ చారిత్రాత్మక వేడుకతో ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తుంటే, సరిగ్గా ఇదే తరుణంలో జగన్ ఈ జైలు పర్యటనను ఎందుకు ఎంచుకున్నారు? మరో మూడు రోజులు ఆగితే సీదిరి అప్పలరాజుకు వచ్చే నష్టమేమిటి? అభివృద్ధిని పక్కన పెట్టి, వివాదాస్పద పరామర్శల ద్వారా అజెండాను డైవర్ట్ చేయాలన్న ప్రయత్నమే ఈ టూర్‌ వెనుక ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, జగన్ వేస్తున్న ప్రతి అడుగు రాజకీయంగా రగడ సృష్టిస్తుండటంతో, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ వ్యూహాలను ఎలా తిప్పకొడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags
Visakhapatnam YS Jagan Bhogapuram Airport Andhra Pradesh AP Politics YSRCP
Recent Comments
Leave a Comment

Related News