మ‌హిళ నైటీ చించి వీరంగం.. వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌.!

admin
Published by Admin — August 02, 2026 in Politics, Andhra
News Image

రాజకీయ నాయకులు ప్రజలకు రక్షణగా నిలవాలి. కానీ, కొందరు మాత్రం తమ అధికార బలంతో అడ్డగోలుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఒక ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. అధికార మదంతో ఒక ప్రజాప్రతినిధి తన హద్దులను దాటి, ఏకంగా మహిళపై దౌర్జర్యానికి దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి(MLA Virupakshi)ని అదుపులోకి తీసుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆలూరు(Alur) పరిధిలోని చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో చిన్నపాటి రాజకీయ వాగ్వాదం పెను వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి స్థానికులైన గురునాథ్ శివ, నాగరాజులతో తీవ్ర అసభ్య పదజాలంతో గొడవకు దిగాడు. దీనిని నాగరాజు తీవ్రంగా ప్రశ్నించడంతో వివాదం ముదిరింది. వెంటనే గిరి రంగంలోకి దిగి స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షికీ ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. తన వాడికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కోపంతో ఎమ్మెల్యే విరూపాక్షి ఏమాత్రం ఆలోచించకుండా రంగంలోకి దిగారు.

ఎమ్మెల్యే హోదాలో శాంతిభద్రతలను కాపాడాల్సిన వ్యక్తినే.. సుమారు 10 కార్లతో భారీ కాన్వాయ్‌ను వెంటేసుకుని సంగాల గ్రామానికి చేరుకున్నారు. ఆయన రాకతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. నేరుగా బాధితుడు నాగరాజు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వర్గం, దౌర్జన్యంగా లోపలికి చొబడింది. ఎమ్మెల్యే(MLA) కళ్లెదుటే ఆయన అనుచరులు ఇంట్లోని గృహోపకరణాలు, వస్తువులను విచక్షణారహితంగా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాగరాజు భార్య సుచిత్రపై దుండగులు భౌతిక దాడికి దిగారు. ఓ మహిళ అని కూడా చూడకుండా ఆమెపై చేయి చేసుకొని, నైటీని చించివేసి తీవ్ర అవమానానికి గురిచేశారు. అంతేకాదు, బాధితులను పరామర్శించడానికి వచ్చిన స్థానిక నేత కొండ పురుషోత్తం కారును సైతం ధ్వంసం చేసి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు.

ఈ దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, పక్కా ఆధారాలతో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు బాధ్యులందరినీ అరెస్టు చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన కుటుంబంపై, ముఖ్యంగా మహిళపై ఇంతటి దారుణానికి పాల్పడటాన్ని ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అయితే, తాము అధికారంలో లేమనో లేదా తమ పార్టీ ఎమ్మెల్యే అనో ఈ అరెస్టును వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలు రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించడం గమనార్హం.

Tags
MLA Virupakshi Arrest Andhra Pradesh AP News YSRCP Alur AP Politics
Recent Comments
Leave a Comment

Related News