'ఇరుముడి' జోష్.. ఇద్ద‌రు యంగ్ డైరెక్ట‌ర్ల‌కు ర‌వితేజ్ గ్రీన్‌సిగ్న‌ల్‌.!

admin
Published by Admin — August 29, 2026 in Movies
News Image

బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి(Irumudi)' సాధించిన ఘన విజయం మాస్ మహారాజా రవితేజ కెరీర్‌కు సరికొత్త ఊపునిచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, బలమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేయడంతో పాటు రవితేజను తిరిగి ఫామ్‌లోకి తెచ్చింది. ఈ సక్సెస్ ఇచ్చిన జోరుతో ఆయన ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తన తర్వాత సినిమాలపై వేగం పెంచారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌లోని ఇద్దరు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.  

'సరిపోదా శనివారం' వంటి వైవిధ్యమైన చిత్రంతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా రవితేజ(Ravi Teja)ను కలవడం, ఆయనకు కథ వినిపించడం జరిగిపోయాయి. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్‌కు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో వివేక్ ఆత్రేయ మార్క్ టేకింగ్, రవితేజ ఎనర్జీ కలిస్తే తెరపై ఏ స్థాయిలో వినోదం పండుతుందోనని సినీ వర్గాల్లో అప్పుడే చర్చ కూడా మొదలైంది.  

ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVSC) బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తుండటం తెలిసిందే. 'ఎస్‌వీసీ64' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి. వినూత్న కథలు చెప్పడంలో సిద్ధహస్తుడైన హసిత్ గోలి, రవితేజ టైమింగ్‌ను ఏ విధంగా వాడుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.  

ఇక ప్రస్తుతానికి హసిత్ గోలి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టి పూర్తి చేయాలని, ఆ వెంటనే వివేక్ ఆత్రేయ(Vivek Athreya) సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టాలని రవితేజ ప్లాన్ చేసుకున్నారు. ఏదేమైనా వరుస సక్సెస్‌లతో జోరుమీదున్న రవితేజ ఈ లైనప్‌తో బాక్సాఫీస్ వద్ద మరింత హవా నడిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags
Mass Maharaja Ravi Teja Irumudi Vivek Athreya Hasith Goli Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News