విజయనగరం జిల్లా రాజకీయాలంటే ఒకప్పుడు ఒక్కటే పేరు గుర్తుకువచ్చేది.. అదే బొత్స సత్యనారాయణ! దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీకి తిరుగులేని చక్రవర్తిగా వెలిగిన ఆయన, ఈమధ్య పార్టీ సమావేశాల్లో తీవ్ర భావోద్వేగానికి గురవుతుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సొంత మేనల్లుడు, కీలక నేత మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీకి హ్యాండ్ ఇచ్చి అధికార టీడీపీ(TDP) కండువా కప్పుకోవడమే బొత్స కంటతడికి కారణమని అందరూ భావిస్తున్నారు. కానీ, అసలు నిజం వేరే ఉందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరందుకుంది. మేనల్లుడి నిష్క్రమణ కంటే, ఆ పరిణామం తర్వాత అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న షాకింగ్ నిర్ణయాలే బొత్సను మానసికంగా ఎక్కువ దెబ్బతీశాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
"నాయకులు వస్తుంటారు, పోతుంటారు.. పార్టీ మాత్రమే నిలిచి ఉంటుంది" అని బొత్స పైకి ధైర్యంగా చెప్తున్నా, లోలోపల అసలు బాధ వేరే ఉందనేది స్పష్టమవుతోంది. సొంత మేనల్లుడిని కూడా పార్టీలో నిలబెట్టుకోలేకపోయారనే భావనతో జగన్ మోహన్ రెడ్డి బొత్స మార్క్ రాజకీయంపై నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోంది. అందుకే జిల్లాపై బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కంట్రోల్‌కు చెక్ పెడుతూ.. ఆయనకు సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్‌కు విజయనగరం జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. పైగా నెల్లిమర్లలో బొత్సకు కుడిభుజంగా ఉండే బడ్డుకొండ అప్పల్నాయుడిని పదవి నుంచి తప్పించడం యాదృచ్ఛికంగా జరిగిన మార్పు కాదనేది క్యాడర్ మాట. ఇకపై బొత్స కుటుంబం చెప్పినట్లే వినేది లేదని, అధిష్టానమే నేరుగా గ్రౌండ్ లెవల్ రాజకీయాలను నడుపుతుందని జగన్ ఇచ్చిన సంకేతం బొత్సకు పెద్ద మైండ్ బ్లాక్‌గా మారింది.
అలాగే ఉమ్మడి విశాఖ, విజయనగరం(Vizianagaram) జిల్లాల్లో ఒకప్పుడు బొత్స వేసిన గీత దాటడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఏ పదవి ఎవరికి వెళ్ళాలన్నా ఆయన ముద్ర పడాల్సిందే. కానీ నేడు సీన్ పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుతం ఆయన శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్నతమైన పదవిలోనే ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్రలో పార్టీ వ్యూహాలను నిర్దేశించే పవర్ స్టీరింగ్ మాత్రం ఆయన చేతి నుంచి చేజారిపోయింది.
రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. కానీ, దశాబ్దాల తరబడి తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన వ్యక్తి.. తన సొంత పార్టీలోనే ప్రాధాన్యత కోల్పోతున్నానని గ్రహించిన క్షణమే అత్యంత వేదన కలిగిస్తుంది. బొత్స పదే పదే కంటతడి పెట్టడం వెనుక ఉన్నది మేనల్లుడు పార్టీ మార్పు మాత్రమే కాదు.. వైఎస్ జగన్(YS Jagan) తనపై ఉంచిన అపారమైన విశ్వసనీయత తగ్గిపోయిందనే చేదు నిజం. ఇక ఒకవేళ జిల్లాలో బెల్లాన చంద్రశేఖర్ వర్గం పూర్తిగా ఆధిక్యం సాధిస్తే, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీలో బొత్స అధ్యాయం ముగిసినట్లే అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.