వై నాట్ పులివెందుల.. జగన్ అడ్డాలో కూట‌మి మాస్ట‌ర్ స్కెచ్‌.!

admin
Published by Admin — October 05, 2026 in Politics, Andhra
News Image

గతంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలను 'వై నాట్ 175' అనే నినాదం ఒక ఊపు ఊపింది. కానీ, కాలం మారిన తరుణంలో ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి అమలు చేస్తున్న సరికొత్త వ్యూహం ప్రతిపక్ష శిబిరాన్ని కలవరపెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, మంత్రి నారా లోకేష్ మంగళగిరి వరకు ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నారు. ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని నియోజకవర్గాలను సమానంగా ముందుకు తీసుకెళ్తున్న కూటమి సర్కార్, ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డపైనే ప్రత్యేక దృష్టి సారించింది.

'వై నాట్ పులివెందుల' అంటూ కూటమి ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైఎస్సార్‌సీపీ అధినేత సొంత నియోజకవర్గంలోనూ అభివృద్ధి జరిగి తీరుతుందనే సంకేతాలను ప్రభుత్వం స్పష్టంగా ఇస్తోంది. దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పులివెందుల(Pulivendula) ప్రజల కష్టాలను తీర్చేందుకు ఒక పక్కా ప్రణాళికతో అడుగులు పడుతున్నాయి. కుప్పంలో కృష్ణ నీటి పరుగులైనా, పిఠాపురంలో డంపింగ్ యార్డులు పీఠికాపురం పార్కులుగా మారిన వైనమైనా, మంగళగిరిలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ బడుల నిర్మాణాలైనా... కూటమి చెబుతున్న మాటలకు చేతలకు పొంతన కుదురుతుందనడానికి నిదర్శనం.

మరోవైపు, ఈ వేగవంతమైన రాజకీయ పరిణామాలతో వైసీపీ(YCP) శిబిరంలో తీవ్ర నిస్సహాయత అలుముకుంది. సంక్షేమం అంటే కేవలం బటన్లు నొక్కడం కాదని, భవిష్యత్ తరాల కోసం మౌలిక వసతులు కల్పించడమే అసలైన ప్రభుత్వ లక్ష్యమని కూటమి నేతలు చేతల్లో నిరూపిస్తున్నారు. రోజుకో శంకుస్థాపన, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రారంభోత్సవాలతో అభివృద్ధి పరుగులు పెడుతుంటే, ప్రత్యర్థి పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలు, వలసలతో సతమతమవుతోంది. 

ఒకవైపు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దూకుడు రాజకీయాలు, మరోవైపు సొంత నియోజకవర్గంలోనూ ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు వైఎస్ జగన్(YS Jagan) భవిష్యత్ వ్యూహాలను దెబ్బతీస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వేస్తున్న ప్రతి అభివృద్ధి అడుగు రేపు ఆ పార్టీకి రాజకీయంగా బలమైన పునాదిగా మారుతుంటే, విపక్షానికి మాత్రం అది కోలుకోలేని దెబ్బగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి 'వై నాట్ పులివెందుల' అనే నినాదం కేవలం ఒక మాట కాకుండా, జగన్ అడ్డాలో కూటమి సర్కార్ ఆడుతున్న పక్కా మాస్టర్ స్కెచ్‌గా మారుతోంది.

Tags
Pulivendula AP Politics Andhra Pradesh TDP JSP Chandrababu YS Jagan YSRCP
Recent Comments
Leave a Comment

Related News