నేను చ‌నిపోలేదు.. బతికే ఉన్నా.. రూమ‌ర్స్‌పై న‌టి ఫైర్‌..!

admin
Published by Admin — September 21, 2026 in Movies
News Image

ఇంటర్నెట్, సోషల్‌ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చాక సమాచారం క్షణాల్లో ప్రయాణిస్తోంది. కానీ, ఇదే సాంకేతికత ఇప్పుడు బాధ్యతారహితమైన పోస్టులకు, తప్పుడు ప్రచారాలకు నిలయంగా మారుతోంది. క్షణాల వ్యవధిలో ఎక్కువ మందిని చేరాలన్న అత్యాశతో కొందరు ఎలాంటి నిజానిజాలు పరిశీలించకుండా ఫేక్‌ న్యుస్‌ సృష్టిస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, ఆరోగ్యంపై నిత్యం ఏదో ఒక పుకారు పుట్టించడం సోషల్‌ మీడియాలో ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా ప్రముఖ సీనియర్‌ నటి వడివుక్కరసి విషయంలోనూ ఇదే తరహా త‌ప్పుడు ప్రచారం జరగడం తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది?
ఐదు దశాబ్దాలకు పైగా సినీ, టెలివిజన్‌ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దిగ్గజ నటి వడివుక్కరసి. కమల్‌హాసన్‌(Kamal Haasan) ‘సిగప్పు రోజాక్కల్‌’తో మొదలుకొని ఎన్నో వందల చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. అటువంటి సీనియర్‌ నటి కన్నుమూశారంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ, ఇకలేరంటూ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. ఈ తప్పుడు వార్తలు క్షణాల్లో వైరల్ కావడంతో ఆమె అభిమానులు, తెలుగు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఆమెకు ఏమైందంటూ ఆరా తీయడం ప్రారంభించారు.

అయితే తనపై వస్తున్న మరణ వార్తలపై నటి వడివుక్కరసి(Vadivukkarasi) తీవ్రంగా స్పందించారు. ఓ ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. ఆ వదంతులన్నింటినీ ఖండించారు. "నేను చనిపోలేదమ్మా.. పూర్తి ఆరోగ్యంగా, చాలా బాగున్నాను" అంటూ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. అసలు లేనిపోని విషయాలను సృష్టించి, బతికి ఉన్నవారికి చావును ఆపాదిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఏంటని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన క్షేమం కోరి ఫోన్‌ చేసిన ప్రతి ఒక్క అభిమానికి, సన్నిహితులకు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఈ సంఘటన మరోసారి సోషల్‌ మీడియాలోని చీకటి కోణాన్ని కళ్లకు కట్టింది. వ్యూస్‌, లైకులు, క్లిక్‌బైట్ల కోసం ఎలాంటి నీచానికైనా ఒడిగట్టే క్షణికానంద సంస్కృతి సమాజంలో ఎంతలా వేళ్లూనుకుందో చెప్పడానికి ఇటువంటి ఉదంతాలే నిదర్శనం. వ్యక్తిగత గోప్యతను, మానవ విలువలను గాలికొదిలేసి కేవలం సంచలనం కోసం ప్రాణాలతో ఉన్నవారికే అంత్యక్రియలు నిర్వహించే స్థాయికి దిగజారడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నెటిజన్లు, సోషల్‌ మీడియా పేజీల నిర్వాహకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ఫేక్‌ న్యుస్‌ను నమ్మకుండా నిజానిజాలు తెలుసుకునే విచక్షణ పాటించాలని సినీ వర్గాలు కోరుతున్నాయి.

Tags
Vadivukkarasi Fake News Social Media Rumors Kollywood Senior Actress
Recent Comments
Leave a Comment

Related News