సినిమా తారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకోవడం అభిమానులకు ఒక హాబీ. వారి ఊరు, చదువు, నేపథ్యం మాత్రమే కాకుండా.. సెలబ్రిటీల ఏజ్ విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ విపరీతమైన చర్చలు జరుగుతుంటాయి. తాజాగా ఈ హాట్ టాపిక్ కేంద్రంగా మారారు 'బేబి(Baby)' భామ వైష్ణవి చైతన్య.
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రయాణం ప్రారంభించి ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లవుతున్నా, వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) చూడటానికి ఇప్పటికీ పక్కింటి చిన్నపిల్లలానే కనిపిస్తుంది. అయితే, ఆమె రూపం చూసి మోసపోవద్దని, ఆమె వయసు ఏకంగా 32 ఏళ్లంటూ నెట్టింట ఒక వార్త దావానలంలా వ్యాపించింది. వికీపీడియా సహా పలు సినీ వెబ్సైట్లలో కూడా ఆమె వయసు 32 ఏళ్లుగానే నమోదు కావడంతో నెటిజన్లు సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే, తన వయసుపై జరుగుతున్న ఈ ప్రచారానికి తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వైష్ణవి(Vaishnavi) స్వయంగా చెక్ పెట్టారు. వికీపీడియాలో ఉన్నది పూర్తిగా తప్పు సమాచారమని తేల్చిచెప్పారు. అంతటితో ఆగకుండా ఇంటర్వ్యూలోనే తన ఆధార్ కార్డ్‌ను చూపుతూ.. తనకు ప్రస్తుతం 25 ఏళ్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఒకవేళ తనకు నిజంగా 32 ఏళ్లు ఉంటే ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి తనకేమీ మొహమాటం లేదని, కానీ లేని వయసును తనపై రుద్దవద్దంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. 'బేబి' తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టిన ఈ తెలుగమ్మాయికి ఆ తర్వాత కాలం పెద్దగా కలసిరావడం లేదు. 'లవ్ మి', 'జాక్' చిత్రాలు నిరాశపరచగా, ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన 'ఎపిక్(Epic)' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వరుస ప్లాప్‌ల నుంచి బయటపడేందుకు వైష్ణవి ప్రస్తుతం నితిన్ సరసన నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌పైనే కొండంత ఆశలు పెట్టుకుంది.