బాబు ప‌ర్స‌న‌ల్ టూర్‌కి వెళ్తే వైసీపీకి ఎందుకంత‌ మంట.?

admin
Published by Admin — September 28, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం, తప్పులను ఎత్తిచూపడం సహజమే. కానీ, విమర్శించే క్రమంలో కాస్త లాజిక్ మిస్ అయితే నవ్వులపాలు కావడం ఖాయం. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎదురవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కుటుంబంతో కలిసి కొద్ది రోజుల పాటు వ్యక్తిగత పర్యటనకు వెళ్తే, దానిని ఏదో అంతర్జాతీయ రహస్యంలా, పెద్ద కుట్రలా చిత్రీకరించడానికి వైసీపీ నేతలు పడుతున్న తపన చూస్తుంటే జాలేస్తోంది. అసలు బాబు పర్సనల్ టూర్‌కి వెళ్తే వీళ్లకెందుకు అంత మంట? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అధికారిక పర్యటనలకు, వ్యక్తిగత టూర్లకు(Personla Tour) మధ్య ఉండే కనీస తేడాను కూడా విస్మరించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో దేశం దాటి వెళ్తున్నప్పుడు నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు అధికారిక సమాచారం ఇవ్వడం పరిపాటి. కానీ, ఎవరి సొంత ఖర్చులతో వారు కుటుంబంతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ప్రతి అడుగుకు సంబంధించిన లైవ్ లొకేషన్ ఇవ్వాలని కోరడం ఏ శ్రేష్టమైన రాజకీయమో వారికే తెలియాలి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి కూడా 'రైట్ టు ప్రైవసీ' ఉంటుందనే ప్రాథమిక సూత్రం మరచిపోయి ప్రవర్తించడం విచారకరం. ప్రభుత్వ సొమ్ముతో వెళ్తే లెక్కలు అడగవచ్చు, కానీ సొంత జేబులోని డబ్బులతో వెళ్లే టూర్‌పై నిఘా పెట్టడం ఏంటి?

ఇక్కడ వైసీపీ నేతలు కావాలనే విస్మరిస్తున్న అసలు నిజం మరొకటి ఉంది. అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కేసుల తీవ్రతను బట్టి కోర్టు విధించిన షరతుల మేరకు ప్రతి వివరమూ, బస చేసే హోటల్ అడ్రస్ కూడా పిటిషన్‌లో పెట్టాల్సి ఉండేది. అందుకే ఆయన టూర్ వివరాలు ముందే మీడియాకు లీక్ అయ్యేవి. కానీ, చంద్రబాబుకు అలాంటి క్రిమినల్ కేసులు, కోర్టు ఆంక్షలు లేవు. చట్టపరమైన ఇబ్బందులు లేనప్పుడు ప్రైవేట్ విషయాలను బహిరంగంగా డప్పు కొట్టుకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. ఈ స్పష్టమైన తేడాను పక్కన పెట్టి, "ఎక్కడికి వెళ్లారో చెప్పలేదు" అంటూ మైకులు పట్టుకుని రచ్చ చేయడం వారి రాజకీయ అజ్ఞానానికి అద్దం పడుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది. ప్రజలను వేధిస్తున్న సమస్యలపై గట్టిగా నిలదీయడం, అసెంబ్లీలో లేదా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మానేసి.. ఇలాంటి వ్యక్తిగత టూర్ల మీద పడటం ప్రతిపక్షం బాల్ సైజ్ ఏంటో తేటతెల్లం చేస్తోంది. ఒక ముఖ్యమంత్రి రెండు మూడు రోజులు పర్సనల్ టూర్‌కు వెళ్తే అందులో ఏదో పెద్ద మిస్టరీ ఉందని ఊహాగానాలు అల్లేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందేమో కానీ, ప్రభుత్వ ప్రతిష్టకేం భంగం రాదు. ఏదేమైనా, నిర్మాణాత్మక రాజకీయాలు వదిలి ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో కాలం వెళ్లదీస్తుంటే.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ(YCP) మనుగడ ప్రశ్నార్థకం కావడం ఖాయం.

Tags
CM Chandrababu Naidu YSRCP AP Politics Right To Privacy Andhra Pradesh YS Jagan Chandrababu 3 Days Tour
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News