వివేకా కేసులో లబ్ధిదారుడు జగనే!

admin
Published by Admin — September 30, 2026 in Politics
News Image

వైఎస్ వివేకా హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదన్న సంగతి తెలిసిందే. తన తండ్రిని చంపిన, చంపించిన వారికి శిక్ష పడాలని, తనకు న్యాయం జరగాలని వివేకా తనయురాలు సునీత ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివేకా కేసుపై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య వల్ల అంతిమ లబ్ధిదారుడు జగనేనని ధ్వజమెత్తారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం కావడంతో తాడేపల్లి ప్యాలెస్ కూసాలు కదులుతున్నాయని, అందుకే ధర్నాల పేరిట జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారని ఆరోపించారు.

సొంత బాబాయ్ గొడ్డలిపోటుకు గురైతే గుండెపోటుగా నమ్మించి సాక్ష్యాలను తుడిచిపెట్టిన చరిత్ర జగన్‌ దని దుయ్యబట్టారు. అదే తరహాలో డైవర్షన్ రాజకీయాలకు ఇప్పుడు జగన్ పాల్పడుతున్నారుని ఆరోపించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, సునీల్ యాదవ్ సంచలన వాస్తవాలు వెల్లడించారని అన్నారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతోనే డీఎస్సీ వంటి అంశాలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయుడు కాకుమాను రాజశేఖర్‌ను ధర్నాకు బలవంతంగా పిలిపించి, ఆయన మృతికి కారకులయ్యారని, ఆ మరణంపై కూడా ఈ రోజు జగన్ శవ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, వివేకా కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని ఈడీ వరుసగా రెండో రోజు కూడా విచారణ జరిపింది. వివేకా హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మరో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య వెనుక రూ.40 కోట్ల భారీ సుపారీ డీల్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి అడ్వాన్స్‌గా రూ.1 కోటి ఇచ్చినట్లు, అలాగే సుమారు రూ.4 కోట్ల నగదు చేతులు మారినట్లు వస్తున్న ఆరోపణలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags
Jagan final beneficiary in Viveka's murder case minister anagani satya prasad
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News