కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్–2026లో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని అన్నారు. తమ నుంచి యువత కోరుకుంటున్నది అదేనని, అందుకే ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా జెన్ జీ యువత కొత్త మార్పు కోరుకుంటోందని చెప్పారు.
రెండేళ్లలో 16 వేల టీచర్ ఉద్యోగాలిచ్చామని, డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. క్రీడా కోటాలో ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసినవేనని వెల్లడించారు. ఈ అంశంపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీ ఊహ కాదని, నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అని అన్నారు. తొలి 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
ఏపీలో పెట్టుబడుల కోసం స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే 3ఎస్ విధానాన్ని అనుసరిస్తున్నామని లోకేశ్ చెప్పారు. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వడం, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు తెలియజేయడం, ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండేలా చూడటం తమ విధానమన్నారు.