కరివేపాకులా వాడేశారంటున్న సాయిరెడ్డి!

admin
Published by Admin — September 30, 2026 in Andhra
News Image

ఏపీ ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీపై ఆ పార్టీ మాజీ నాయ‌కుడు, మాజీ ఎంపీ వి. విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌పై వైసీపీది బూట‌కపు ప్రేమ అని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌పై ప్రేమ‌ను కొంద‌రు నాయ‌కులు న‌టిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌జ‌లకు ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. వారికి అండ‌గా ఉండేదే నిజ‌మైన పార్టీ అని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. ప‌రామ‌ర్శ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నార‌ని అన్నారు.

అస‌లు దుర్మార్గుడు..

వైసీపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డే అస‌లు సిస‌లు దుర్మార్గుడని సాయిరెడ్డి దుయ్య‌బ‌ట్టారు. త‌న‌ను జ‌గ‌న్ ద‌గ్గ‌ర అత్యంత క్రూరంగా చిత్రీక‌రించి.. త‌న‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగేలా చేశార‌ని విరుచుకుప డ్డారు. దుర్మార్గాల‌న్నీ చేసింది స‌జ్జ‌లేన‌ని చెప్పారు. ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఒరిగింది ఏమైనా ఉందా? అని ప్ర‌శ్నించారు. స‌జ్జ‌ల కార‌ణంగా పార్టీ అన్ని ర‌కాలుగా న‌ష్ట‌పోయింద‌ని, అనేక మంది నాయ‌కులు పార్టీని వ‌దిలేశార‌ని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

వాడుకుని వ‌దిలేశారు..

``వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. చ‌క్రం తిప్పాన‌ని నాపై చాలా మంది వ్యాఖ్య‌లు చేశారు. కానీ, నేను కాదు.. అస‌లు చ‌క్రం తిప్పింది స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డే. రాజ‌కీయంగా ఎన్నిక‌ల‌కు ముందు న‌న్ను వాడుకున్నారు. అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌క్క‌న పెట్టారు.`` అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. త‌న‌పై కుట్ర‌లుకూడా చేశార‌ని అన్నారు. దుష్ప్ర‌చారం చేసి.. త‌న‌ను ఒక విల‌న్ మాదిరిగా చిత్రీక‌రించార‌ని అన్నారు. అయితే. తాను ఎలాంటి వాడినో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

విశాఖ‌లో ద‌మ్ము లేదు..

వైసీపీ త‌ర‌ఫున విశాఖ‌ప‌ట్నంలో పార్టీని డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు సాయిరెడ్డి తెలిపారు. గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో విశాఖ మేయ‌ర్ పీఠాన్ని కైవ‌సం చేసుకునేలా పావులు క‌దిపిన‌ట్టు తెలిపారు. పాద‌యాత్ర కూడా చేశాన‌ని గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు ఆ స్థాయిలో వైసీపీకి నాయ‌కులు ఉన్నారా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత ఇంచార్జ్‌(క‌న్న‌బాబు) కు ద‌మ్ముందా? కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించ‌గ‌ల‌రా? అని నిల‌దీశారు. 

Tags
Ycp jagan fake love Vijaya Sai Reddy
Recent Comments
Leave a Comment

Related News