పీఆర్ టీంల సాయంతో సోషల్ మీడియాలో తమ సినిమాలకు ఎలివేషన్ ఇచ్చుకోవడం ఒకెత్తయితే.. వేరే వాళ్ల సినిమాలను టార్గెట్ చేయడం మరో ఎత్తు. లక్షలు ఖర్చు పెట్టుకుని వేరే హీరోలను, వారి సినిమాలను టార్గెట్ చేసే హీరోలు కొందరు టాలీవుడ్లో ఉన్నారన్నది ఇండస్ట్రీ వర్గాలకు తెలిసిన విషయమే. ఇటీవల దీని గురించి యంగ్ హీరో సందీప్ కిషన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన లీగ్‌లో ఉన్న ముగ్గురు యంగ్ హీరోలు.. పీఆర్ టీంల సాయంతో వాళ్లు, వాళ్ల సినిమాలు మాత్రమే సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చేస్తున్నారని.. పది లక్షలు డబ్బులు పెట్టుకుని యావరేజ్ సినిమాలుగా, హిట్ సినిమాలను బ్లాక్‌బస్టర్లుగా మార్చుకుంటున్నారని అతను వ్యాఖ్యానించాడు. అలాగే ఈ పీఆర్ టీంల సాయంతో వేరే వాళ్ల సినిమాలను టార్గెట్ చేయడం కూడా జరుగుతోందని అతనన్నాడు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా.. ఇప్పుడు సందీప్ ఇంకో షాకింగ్ ట్వీట్‌తో వార్తల్లోకి వచ్చాడు.
శుక్రవారం విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘సిగ్మా’ను పనిగట్టుకుని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందని అతను ఆరోపించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నన్ను, నా సినిమాను టార్గెట్ చేస్తూ అనేక ట్వీట్లు చూస్తుంటే నవ్వొస్తోంది. దీని వెనుక ఉన్న వ్యక్తులెవరో నాకు స్పష్టంగా తెలుసు. దీని కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కూడా. మీ అందరికీ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. దీని వల్ల నాకంటే మీరే ఎక్కువ నష్టపోతారు.
డైరెక్ట్ అయిపోతే దొరికపోతారు మరి. చూస్కోండి’’ అని సందీప్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో సందీప్‌ను, అతడి సినిమాను అదే పనిగా టార్గెట్ చేస్తున్నది ఎవరు.. ఎందుకు అతడి మీద ఇలా కక్షగట్టారు అనే చర్చ జరుగుతోంది. ఈ వారం రిలీజయ్యే సినిమాలకు సంబంధించి ఎవరినైనా ఉద్దేశించి సందీప్ అన్నాడా.. లేక ఇంకెవరైనా తన మీద కక్ష గట్టి ఇలా చేస్తున్నారా అన్నది చర్చనీయాంశం అవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’కు తమిళంలో మంచి బజ్ క్రియేట్ అయింది. తెలుగులో మాత్రం అంత హైప్ కనిపించడం లేదు. మరి సందీప్, జేసన్ కంటెంట్‌తో కొడతారేమో చూడాలి.