``చంద్రబాబుకు పనీపాటా లేదు. ఏదో ఒక విధంగా అడ్డుకునేందుకు చూస్తారు. అందుకే ప్రతి విషయానికీ కోర్టు మెట్లు ఎక్కుతారు. అడ్డు కుంటారు. వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తారు`` - 2022లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆయన మరిచిపోయి ఉండొచ్చు. కానీ, గూగులమ్మ మాత్రం మరిచిపోదుగా అన్నట్టు.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి. ``జగన్ సర్ గుర్తుందా`` అని కామెంట్లు కూడా కురుస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.
తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల విషయంలో తాము పైచేయి సాధించేందుకు వైసీపీ నాయకులు ఆపశోపాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ముందు సర్ ప్రక్రియ పేరుతో హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా పనికాలేదు. ఆ తర్వాత.. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయడం లేదని.. పేర్కొంటూ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. కానీ, ఈ విషయంలోనూ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇక, తాజాగా కేంద్ర బలగాలను మోహరించి.. వారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టును అభ్యర్థించారు.
కానీ, ఈ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. దాదాపు ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి 24 పిటిషన్లను హైకోర్టులోను, 5 పిటిషన్ల ను సుప్రీంకోర్టులోనూ దాఖలు చేశారు. అయినప్పటికీ ఎక్కడా ఆశించిన ఫలితం రాలేదు. కట్ చేస్తే.. ఇప్పటికీ వైసీపీ న్యాయ పోరాటం ఆపలేదు. తాజాగా సోమవారం సాయంత్రం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. నామినేషన్ల సమయంలో జరిగిన ఘర్షణలను వివరించింది. తమవారు వేసిన నామినేషన్లను చించేశారని.. అసలు నామినేషన్ కేంద్రాల వద్దకు కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అనుమతించాలని కోరింది.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారిస్తుందా? లేదా? అనేది చూడాలి. ఇప్పటికే నామినేషన్ల దాఖలుకు గడువు తీరిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇదిలావుంటే.. గతంలో చంద్రబాబు పలుఅంశాలపై కోర్టును ఆశ్రయించినప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధించిన జగన్.. ఇప్పుడు అదే కోర్టును ఆశ్రయించడం గమనార్హం. గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడు అవే కోర్టుల ద్వారా ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే.. అంతా సజావుగానే సాగుతోందని.. కోర్టు కూడా ఇదే చెబుతున్నాయని అంటున్నారు.