సెలబ్రిటీల జీవితం పైకి ఎంత గ్లామరస్‌గా, ప్రశాంతంగా కనిపిస్తుందో.. తెరవెనుక వారు ఎదుర్కొనే ఇబ్బందులు మాత్రం అంతకు మించి ఉంటాయి. వెండితెరపై నవ్వులు పంచే నటీనటులు, నిజ జీవితంలో ఒక్కోసారి ఊహించని వేధింపులను, భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)కు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన ఓ భయానక ఘటనే ఇందుకు నిదర్శనం.
ప్రయాణ నిమిత్తం ఓ విమానాశ్రయానికి(Airport) వెళ్లిన అనుపమ.. తన లగేజీ కోసం ఒంటరిగా వేచి చూస్తున్న సమయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఆమెను గమనించి ఒక్కసారిగా చుట్టుముట్టారు. మొదట సాధారణంగా పలకరించినట్టే వచ్చి, క్షణాల వ్యవధిలో హద్దులు మీరడం ప్రారంభించారు. కనీసం అనుమతి కూడా తీసుకోకుండా ఫొటోలు క్లిక్ మనిపించడం మొదలుపెట్టారు.
ఇక ఆ హడావుడిలోనే కొందరు తనను అసభ్యకరంగా తాకారని, ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక తీవ్ర అభద్రతాభావానికి గురయ్యానని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు(Fans) తనపై చూపించే ప్రేమాభిమానాలను తాను ఎప్పుడూ విలువైనవిగా భావిస్తానని, ఫొటోలు దిగడానికి తనకు ఎలాంటి మొహమాటం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే, అభిమానం పేరుతో జరిగే అతి చేష్టలు, ప్రవర్తనా లోపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తాయని పేర్కొన్నారు. పబ్లిక్ ప్లేస్‌లలో ఎవరి ఉద్దేశం ఎంటో తెలియక, ఎక్కడ తాకుతారనే భయం ప్రతిసారీ వెంటాడుతుందని వాపోయారు.
కేవలం నటీనటులకే పరిమితం కాకుండా, సమాజంలో సాధారణ మహిళలు నిత్యం ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారని.. అలాంటి పరిస్థితుల్లో వారు ప్రదర్శించే ధైర్యం ఎంతో గొప్పదని అనుపమ(Anupama) కొనియాడారు. అభిమానం హద్దుల్లో ఉంటేనే అందం, కానీ అది అవతలి వారి స్వేచ్ఛను హరించేలా మారకూడదనే కఠిన సత్యాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.