``ఇది నా ఇల్లు.. నా కుటుంబానికి చెందిన నివాసం. ఇక్కడ ఎవరి పెళ్లిళ్లు జరిగినా తీవ్రమైన భద్రతా సమస్య వస్తుంది. అర్థం చేసుకో`` అంటూ వైసీపీ అధినేత జగన్.. తన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిలకు లేఖ రాశారు. గత కొన్నిరోజులుగా షర్మిల కుమార్తె అంజలి వివాహానికి సంబంధించి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను ఇచ్చే విషయంలో జగన్ మంకుపట్టు పట్టిన విషయం తెలిసిందే. తన భద్రతను, తన కుటుంబ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్యాలెస్‌ను తన మేనకోడలి వివాహానికి ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాజకీ యంగా పెద్ద దుమారం కూడా రేగింది.
తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి షర్మిలకు జగన్ రాసిన లేఖను వైసీపీ నాయకులు బయటకు తెచ్చారు. గతంలోనే షర్మిలకు జగన్ లేఖ రాశారని.. పలువురు మధ్యవర్తులద్వారా కూడా ఈ విషయాన్ని ఆమెకు చెప్పారని తెలిపారు. అయినప్పటికీ షర్మిల ఉద్దేశ పూర్వకం గా అదే ఇంటిని కోరుతున్నారని పేర్కొన్నారు. అయితే.. జగన్‌కు, ఆయన కుటుంబానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని.. అందుకే వేడుకలకు ఆ ఇంటిని వినియోగించరాదని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ యలహంక ప్యాలెస్‌ను ఎవరి వివాహాలకీ వినియోగించేది లేదని స్పష్టం చేశారు.
కావాలంటే.. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ను వినియోగించుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే.. జగన్ ఈ లేఖను ఈ నెల 9నే షర్మిలకు రాసినట్టు తెలిపారు. అయితే... తన అభ్యంతరాలను పట్టించుకోకుండా.. షర్మిల ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం.. తనకు ఎంతో బాధకలిగించిందని జగన్ పేర్కొన్నారు. ``నువ్వు నా దృష్టితో ఆలోచించాలి`` అని షర్మిలకు జగన్ విజ్ఞప్తి చేసినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ను వినియోగించుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
భద్రత నిజమేనా?
చెల్లెలు కుమార్తె అంజలి వివాహానికి తన ఇంటిని ఇచ్చేది లేదన్న జగన్ వ్యవహారంలో భద్రతను బూచిగా చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఆయన భద్రతతో పాటు షర్మిలకు, ఆమె కుటుంబానికి కూడా భద్రత అవసరమే. అలాంటప్పుడు.. కేవలం జగన్ తన కోణంలోనే ఆలోచన చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టపరమైన, న్యాయపరమైన అంశాలపై ఆయన అంతర్మథనం చెందుతున్నారన్న వాదనా వినిపిస్తోంది. మనసులో ఏదో పెట్టుకుని.. షర్మిలకు ఇప్పుడు కీలక సమయంలో అడ్డు పడుతున్నారన్న వాదన కూడా తెరమీదికి వచ్చింది. ఈ వ్యవహారం కుటుంబ పరమైనదే అయినా.. గత కొన్నాళ్లుగా.. ఇవి కూడా రాజకీయంగా ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ జగన్ తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.