ఆధునిక సాంకేతికతను రాజకీయాల్లో వినియోగించడంలో టీడీపీ మరో ముందడుగు వేసింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఆలోచనతో రూపొందించిన ‘మైటీడీపీ’ యాప్‌లో నమోదైన కార్యకర్తల సంఖ్య 10 లక్షలు దాటిందని టీడీపీ అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల డిజిటల్ నిర్వహణలో ఇది ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
క్షేత్రస్థాయి సాధారణ కార్యకర్తలను గుర్తించి, వారి సేవలకు తగిన అవకాశాలు కల్పించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం. గ్రామాలు, వార్డుల్లో పార్టీ కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, సేవా కార్యకలాపాలు నిర్వహించే వారు తమ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు. దీని ద్వారా వారి పనితీరును అంచనా వేసి, స్థానిక ఎన్నికల్లో టికెట్లు, పదవులు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ స్పష్టం చేసింది.
ఈ యాప్ ద్వారా పార్టీ నాయకుల సందేశాలు, మార్గదర్శకాలు త్వరగా కార్యకర్తలకు చేరుతున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయి సమస్యలు, అభిప్రాయాలు నాయకత్వానికి తెలిసేలా చేస్తోంది. డిజిటల్ మహానాడు, శిక్షణ తరగతులు, సమావేశాల హాజరును కూడా దీని ద్వారానే పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, నాయకులతో కలిసి తీసుకున్న ఫొటోలు సులభంగా పొందేందుకు ‘ఫొటో బూత్’ పేరిట ఫేస్ రికగ్నిషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.