తెలంగాణ(Telangana) రాజకీయ ముఖచిత్రంపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. పైకి నిత్యం కత్తులు దూసుకుంటున్నట్లు కనిపిస్తున్నా, తెర వెనుక మాత్రం బీఆర్ఎస్, బీజేపీల మధ్య స్నేహ చిగుళ్లు వేస్తున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న డీలిమిటేషన్ బిల్లు విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీసుకున్న స్టాండ్ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. కేంద్రం అడగకముందే, ఎలాంటి షరతులు లేకుండా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తున్న వారికి గతంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. తనను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు కూడా సిద్ధపడ్డారని ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో పెను దుమారం రేపాయి. ఆ తర్వాత గులాబీ అధినేత కేసీఆర్(KCR) ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం, కమలనాథులపై విమర్శల దాడిని బాగా తగ్గించడం వంటి అంశాలు ఈ రెండు పార్టీల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతాలుగా పలువురు విశ్లేషిస్తున్నారు.
లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోయినా, రాజ్యసభలో ఉన్న ముగ్గురు సభ్యుల బలంతో కేంద్రానికి అండగా నిలబడతామని కేటీఆర్(KTR) సంకేతాలు పంపడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఎన్డీయే సర్కార్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్, ఇప్పుడు కీలక బిల్లుల విషయంలో మెతక వైఖరి అవలంబించడం భవిష్యత్ పొత్తులకు పునాది వేయడమేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ వంటి నేతలు ఈ బిల్లుపై సానుకూలంగా స్పందించగా, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం. ఇలాంటి చిన్న చిన్న రాజకీయ సంకేతాలే చివరికి రెండు పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చే అవకాశాలు లేకపోలేదని చర్చ జరుగుతోంది.
ఒకవేళ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో 'కారు - కమలం' కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకుంటే, అది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది. అదే జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఇది పెను సవాలుగా మారడం ఖాయం. మరి ఈ దోస్తీ ఊహాగానాలకే పరిమితమవుతుందా, లేక క్షేత్రస్థాయిలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.