ఒక్కోసారి అభిమానులు చేసే పనులు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. తాజాగా అటువంటి అనుభవమే ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కు ఎదురైంది. అభిమాని కత్తిని కానుక బహుకరించడంతో కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పూర్తి వివరాలకు వెళ్తే.. డీఎంకే కూటమి తరపున తమిళనాడు నుంచి కమల్ హాసన్ పార్లమెంటుకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలో నిర్వహించిన తన ఎంఎన్ఎం పార్టీ సమావేశంలో కమల్ హాసన్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఓ అభిమాన కార్యకర్త వేదిక పైకి వచ్చి కత్తిని కానుకగా అందజేశారు. అయిష్టంగానే కమల్ ఆ కత్తిని స్వీకరించారు. ఇంతలోనే సదరు అభిమాని కత్తిని పైకి ఎత్తాలంటూ కమల్ ను కోరారు. అందుకు ఆయన ఏ మాత్రం అంగీకరించలేదు. దాంతో సదరు అభిమాని మరింత ఒత్తిడి తేవడంతో సహనాన్ని కోల్పోయిన కమల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
కత్తిని కింద పెట్టమంటూ గట్టిగా అరిచారు. వెంటనే అక్కడ ఉన్న ఓ పోలీస్ అధికారి జోక్యం చేసుకొని ఆ కార్యకర్తను నిలువరించి కత్తిని పక్కన పెట్టించారు. అనంతరం అదే కార్యకర్త కమల్ తో కరచాలనం చేసి ఫోటో దిగి వెళ్ళిపోయారు. ఈ ఘటనతో పార్టీ సమావేశంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ.. ఆ తర్వాత అంతా సాఫీగా సాగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.