రిలీజ్ ముంగిట ఇంకో టైటిల్ మార్పు

admin
Published by Admin — February 18, 2026 in Movies
News Image
సినిమాలకు సెన్సార్ దగ్గర బ్రేకులు పడడం ఈ మధ్య మామూలైపోయింది. తమిళంలో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘జననాగయన్’కు సెన్సార్ సమస్యలు తలెత్తి.. ఎంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోందో తెలిసిందే. తెలుగులో కూడా సెన్సార్ బోర్డు దగ్గర సినిమాలకు ఊహించని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టైటిళ్ల విషయంలో విచిత్రమైన కారణాలతో సెన్సార్ వాళ్ల అభ్యంతరాలు పెట్టడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
 
‘వానర’ అనే టైటిల్‌తో సినిమా చేసిన ఒక టీం.. విడుదలకు కేవలం రెండు రోజుల ముందు పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ‘వనవీర’ అని వేరే టైటిల్ పెట్టి సినిమాను రిలీజ్ చేయాల్సి రావడంపై ఆ చిత్ర బృందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా టీంకు పేరు మార్చకుంటే ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తామంటే.. ‘ఎ’ ఇచ్చినా పర్లేదంటూ అదే టైటిల్‌ను కొనసాగించారు.
 
కట్ చేస్తే ఇప్పుడు విడుదలకు నాలుగు రోజుల సమయం ఉండగా ‘హే భగవాన్’ టీం పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ పేరు విషయంలో ఏం ఇబ్బంది ఉందో.. సినిమాలో ఏం చూపించారో కానీ.. సెన్సార్ వాళ్లు ఏం సూచించారో కానీ.. దీని టైటిల్ మార్చేశారు. ‘హే బల్వంత్’ అనే కొత్త టైటిల్‌తో టీం పోస్టర్లు వదిలింది.
 
‘హే భగవాన్’ అనే క్యాచీ టైటిల్‌ను ఇలా విడుదలకు కొన్ని రోజుల ముందు మార్చాల్సి రావడం చిత్ర బృందానికి ఇబ్బందే. ప్రమోషన్ల పరంగా కూడా మైనస్సే. సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాల నేపథ్యంలోనే పేరు మార్చినట్లు స్పష్టమవుతోంది. దీనికి కారణమేంటో టీం ప్రమోషన్లలో చెబుతుందేమో చూడాలి. సుహాస్, శివాని నాగారం, నరేష్ ముఖ్య పాత్రలు పోషించిన ‘హే బల్వంత్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీ అచ్చర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Tags
title issues tollywood censor hey balawant movie
Recent Comments
Leave a Comment

Related News