భగ్గుమంటున్న అమెరికా.. చరిత్రలోనే ‘చెత్త’ ప్రెసిడెంట్ గా ట్రంప్‌!

admin
Published by Admin — February 19, 2026 in International
News Image

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు ఏడాది కాలంలోనే ఊహించని రాజకీయ సెగ తగులుతోంది. `అమెరికా ఫస్ట్` అంటూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకే రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా యాహూ/యుగోవ్ నిర్వహించిన సర్వే ఫలితాలు వైట్ హౌస్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. ఏకంగా 40 శాతం మంది అమెరికన్లు ట్రంప్‌ను `అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్`గా అభివర్ణించడం గమనార్హం. గతంలో ఏ అధ్యక్షుడికీ పదవిలో ఉన్న మొదటి ఏడాదిలోనే ఈ స్థాయి వ్యతిరేకత ఎదురుకాలేదని రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సర్వే గణాంకాలను పరిశీలిస్తే ట్రంప్ గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థమవుతుంది. కేవలం 12 శాతం మంది మాత్రమే ఆయనను అద్భుతమైన అధ్యక్షుడుగా కొనియాడుతుండగా, 53 శాతం మంది ఆయనను ఒక విఫల అధ్యక్షుడుగా ముద్ర వేశారు. ట్రంప్ పాలనపై కేవలం 39 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, 58 శాతం మంది ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

గతేడాది లిబరేషన్ డే పేరుతో ఇతర దేశాలపై ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మిత్రదేశాలతో మొదలైన ఈ వాణిజ్య యుద్ధం వల్ల స్వదేశీ మార్కెట్‌లో ధరలు పెరగడం సామాన్యుడికి భారంగా మారింది. అలాగే వలసదారులపై కఠిన ఆంక్షలు, హెచ్-1బీ వీసా నిబంధనల మార్పులు మధ్యతరగతి మరియు టెక్ వర్గాల్లో అసహనాన్ని పెంచాయి. వీటికి తోడు, ప్రతిపక్ష డెమొక్రాట్ల ప్రాబల్యం ఉన్న నగరాల్లో నేషనల్ గార్డ్ ను మోహరించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాయనే విమర్శలకు దారితీశాయి. ఫ‌లితంగా ట్రంప్ గ్రాఫ్ భారీగా ప‌డిపోయింది. ఇక ప్రజాదరణ ఇలాగే పడిపోతూ ఉంటే, 2026లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.

Tags
Donald Trump US Politics White House Trump Rating You Gov Poll Republicans
Recent Comments
Leave a Comment

Related News