మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) క్రమశిక్షణకు, భక్తికి కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అత్యంత నిష్ఠతో అయ్యప్ప మాల ధరించే చరణ్, ఈసారి కూడా స్వామి మాలలోనే కనిపిస్తున్నారు. అయితే, ఇటీవల అల్లు శిరీష్ పెళ్లి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక పార్టీకి చరణ్ హాజరవ్వడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ``మాల వేసుకుని పార్టీలకు వెళ్లడం ఏంటి?`` అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించగా, మరికొందరు అత్యుత్సాహంతో నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
అల్లు శిరీష్ పెళ్లి పార్టీలో చరణ్ ఉన్న ఫోటోలు బయటకు రాగానే, కొందరు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు వాగడం స్టార్ట్ చేశారు.. స్వామి మాలను అవమానించారంటూ, అక్కడ ఆల్కహాల్ ఉంటే వెళ్లడం ఏంటని తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేశారు. చరణ్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ కామెంట్స్ మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. అయితే, ఈ వివాదానికి అనూహ్యంగా అల్లు శిరీష్(Allu Sirish) ఫుల్ స్టాప్ పెట్టారు.

చరణ్‌పై వస్తున్న ట్రోల్స్ చూసి మౌనంగా ఉండలేకపోయిన అల్లు శిరీష్, సోషల్ మీడియా వేదికగా అసలు నిజాన్ని బయటపెట్టారు. ``చరణ్ స్వామి ఆ పార్టీకి చాలా ఎర్లీగా వచ్చారు. అప్పటికి ఇంకా ఫంక్షన్ మొదలే కాలేదు. ఎవరూ ఆల్కహాల్ కూడా తీసుకోలేదు. జస్ట్ మమ్మల్ని కలిసి, ఆశీర్వదించి వెంటనే వెళ్లిపోయారు. అయ్యప్ప మాల(Ayyappa Mala) పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను ఎవరూ శంకించలేరు`` అంటూ శిరీష్ సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. ఆయన పోస్ట్ తో ట్రోలర్స్ నోటికి తాళం వేసినట్లు అయింది.
ఇకపోతే అల్లు శిరీష్ తన చిరకాల ప్రేయసి నయనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. నయనిక ఒక వ్యాపారవేత్త మరియు ఫ్యాషన్ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి. వీరిద్దరి పరిచయం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల్లో మొదలైందని, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని సమాచారం. మార్చి 6న శిరీష్, నయనికల పెళ్లి జరగబోతుంది. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది.