ప్రేమ ఫెయిల్ అయ్యిందన్న వేదనతో ఆత్మహత్య(suicide) చేసుకుంది యూట్యూబర్ కోమలి(youtuber komali). 21 ఏళ్ల చిరు ప్రాయంలో తాను ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెడుతున్నారన్న మనో వ్యధకు గురైన ఆమె.. ఉరి వేసుకొని ప్రాణాల్ని తీసుకుంది. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్ లో బీఎస్సీ చదువుతోంది.
మణికొండలోని చిత్రపురి కాలనీలో ఆమె తన బంధువుల వద్ద ఉంటూ చదువుకుంటోంది.
మల్లారెడ్డి వర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూనే.. పార్ట్ టైంగా యూట్యూబ్ వీడియోలు చేయటం ద్వారా ఫేమ్ సంపాదించింది. లైఫ్ స్టైల్.. డైలీ వ్లాగ్స్.. తన వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన వీడియోలు ఆమెకు ఆదరణ తెచ్చి పెట్టాయి. ఆమెకు యూత్ లో ఫాలోయింగ్ పెరిగేందుకు వీలైంది.
ఇదిలా ఉండగా ఐటీ ఉద్యోగి కం యూట్యూబర్ అయిన అఖిల్ రెడ్డితో ఆమె పరిచయం కాస్తా స్నేహంగా మారి ఆపై ప్రేమకు దారి తీసింది. అయితే.. మూడేళ్ల పాటు సాగిన వారి ప్రేమబంధం ఏడాది క్రితం మనస్పర్థలతో ముగిసినట్లుగా చెబుతారు. లవ్ బ్రేకప్ తర్వాత కోమలి తీవ్ర భావోద్వేగానికి గురై.. ఒత్తిడికి లోనైట్లుగా చెబుతారు. ప్రేమ వైఫల్యం తర్వాత మానసికంగా కుంగిపోయిన కోమలి.. అప్పట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం.. కుటుంబ సభ్యులు అడ్డుకోవటంతో పెద్ద గండం తప్పినట్లైంది. ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
ఇటీవల పెళ్లి విషయంలో అఖిల్ ను ఇంటికి పిలిచిన కోమలి.. పెళ్లి ప్రస్తావన తేవటం.. అందుకు అఖిల్ నో చెప్పిన సందర్భంగా వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు. అనంతరం సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో కోమలి ఊరి వేసుకోవటంతో చనిపోయింది. తన డైరీలో కూడా అఖిల్ తన ప్రేమను అంగీకరించపోవటం అనే విషయాన్ని రాసుకున్నట్లుగా రాయదుర్గం ఇన్ స్పెక్టర్ వెంకన్న వెల్లడించారు. కోమలి ఆత్మహత్యలో అఖిల్ ప్రమేయం ఉంటే అతనిపై తప్పనిసరిగా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
కోమలి తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంతో కోమలి ఆత్మహత్య ఉదంతం బయటకు వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. తన వ్యక్తిగత కోరిక నెరవేరాలని కోరుతూ ఇటీవల కోమలి తిరుమలకు కాలినడకన వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వీడియో వైరల్ గా మారింది. ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ చేసిన కాలినడక వీడియో ఆమె చివరి పోస్టుగా మిగిలినట్లు చెబుతున్నారు.