మండ‌లి చైర్మ‌న్‌పై అవిశ్వాసం?

admin
Published by Admin — March 05, 2026 in Politics
News Image

ఏపీ శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు(ap legislative council chairman moshes raju)పై అవిశ్వాస తీర్మానం (no confidence motion)పెట్ట‌నున్నారా?  ఆయ‌న‌ను ఆ ప‌ద‌వి నుంచి దింపేయాల‌ని కొంద‌రు స‌భ్యులు ప‌ట్టుబ‌డుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుత బ‌డ్జెట్ స‌మావేశాల్లో మోషేన్ రాజుపై అధికార పార్టీ స‌భ్యులు కూడా గుర్రుగానే ఉన్నారు. ఆయ‌న కేంద్రంగా మండ‌లిలో వివాదాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ముఖ్యంగా ల‌డ్డూపై చ‌ర్చ విష‌యంలో మండ‌లి చైర్మ‌న్ తీరును అధికార ప‌క్ష స‌భ్యులు ఆక్షేపిస్తున్నారు.

ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే.. గ‌తంలో వైసీపీ(ycp) నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్సీలు.. త‌మ ఎమ్మెల్సీ ప‌ద‌వులుకు రాజీనామా చేశారు. అయితే.. వీరు రాజీనామా చేసి ఏడాది గ‌డుస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు వాటిని మండ‌లి చైర్మ‌న్ ఆమోదించ‌లేదు. దీంతో ఆయా స‌భ్యులు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు విష‌యంలో ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది ప‌డుతున్నారు. కొంద‌రు టీడీపీలో చేరినా.. స‌భ్య‌త్వం మాత్రం వైసీపీకి ఉండ‌డంతో వీరంతా ఇబ్బంది ప‌డుతున్నారు. కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

వీరిలో వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్సీలు.. జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌, క‌ర్రి ప‌ద్మ‌శ్రీ, పోతుల సునీత‌, బ‌ల్లి క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఉన్నారు. వీరు రాజీనామాలు చేసిన త‌ర్వాత‌.. చైర్మ‌న్ వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. అయితే.. ఆయ‌న వాటిని ఆమోదించ‌డం లేదు. పైగా తిరస్క‌రిం చ‌డం కూడా లేదు. దీంతో జ‌య‌మంగ‌ళ‌.. కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు ఆదేశాల‌తో స‌ద‌రు ఎమ్మెల్సీల‌ను విచార‌ణ చేసిన చైర్మ‌న్‌.. మ‌ళ్లీ త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేశారు.

ఈ క్ర‌మంలో త‌మ రాజీనామాలు ఆమోదించ‌ని .. చైర్మ‌న్‌పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని.. ఆయ‌న ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఈ ఎమ్మెల్సీలు వాదిస్తున్నారు. తాజాగా అవిశ్వాస తీర్మానం ప్ర‌క‌టించేందుకు రెడీ అయ్యారు. స‌భ‌లో వైసీపీకి స‌భ్యుల బ‌లం ఉన్న‌నేప‌థ్యంలో ఈ తీర్మానం వీగిపోయే అవ‌కాశం ఉంది. కానీ, చైర్మ‌న్ వైఖ‌రిపై స‌ద‌రు స‌భ్యులు ప్ర‌సంగించేందుకు మండ‌లిలో అవ‌కాశం ఉంటుంది. ఇక‌, మోషేన్ రాజు ప‌ద‌వీ కాలం .. వ‌చ్చే ఏడాది జూలై వ‌ర‌కు ఉండ‌డం గ‌మ‌నార్హం. 

Tags
AP Legislative Council chairman moshes raju no confidence motion
Recent Comments
Leave a Comment

Related News