సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా జాతీయస్థాయిలో సెలబ్రిటీ ఇమేజ్ సొంతం చేసుకోవటమే కాదు.. సినిమాలో ఛాన్సును సొంతం చేసుకున్న పూసలు అమ్మే మోనాలిసా(monalisa) గుర్తుందిగా. తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడి.. చివరకు ఇంట్లో వాళ్లు నో చెప్పినా ఆమె మాత్రం అతడ్ని పెళ్లి చేసుకుంది.
దీంతో మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం.. చివరకు వారి పెళ్లి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని అరుమనూర్ గుడిలో జరిగింది. ఈ వేడుకకు కేరళ మంత్రి శివన్ కుట్టి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ లు సైతం హాజరు కావటంత విశేషం.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసాకు ఫేస్ బుక్ ద్వారా మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్(farman khan) పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే.. వీరి ప్రేమకథకు మోనాలిసా ఇంట్లో నో చెప్పారు. ప్రస్తుతం ఆమె ది డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఆమె తండ్రి షూటింగ్ వద్దకు వెళ్లి మోనాలిసతో గొడవకు దిగారు. దీంతో.. తమకు ప్రాణహాని ఉందని ఈ జంట పోలీసుల్ని ఆశ్రయించారు.
ఈ సందర్భంగా మోనాలిసా పోలీసులకు తనకున్న ఇబ్బందిని వివరిస్తూ.. తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు. తాను మేజర్ నని.. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ఆమె పోలీసులకు చెప్పటంతో.. వారి వివాహానికి భద్రత కల్పించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదని.. కాకుంటే.. ఆమె తండ్రి బలవంతపు పెళ్లి ప్రతిపాదన నేపథ్యంలోనే తాము జోక్యం చేసుకున్నామని కేరళ పోలీసులు వివరణ ఇస్తున్నారు. దీంతో.. వీరి పెళ్లి కేరళలోని గుడిలో సింఫుల్ గా, కేరళ సంప్రదాయం ప్రకారం జరిగింది. వరుడు ధోవతి ధరించగా.. మోనాలిసా ఎరుపు రంగు పట్టుచీరలో ముస్తాబయ్యారు.
తనకు కేరళ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే కేరళ(kerala)లో పెళ్లి(marriage) చేసుకున్నట్లుగా మోనాలిసా చెప్పింది. ఇక.. మోనాలిసా ప్రియుడు కం భర్త ఫర్మాన్ విషయానికి వస్తే అతను కూడా సినీ నటుడే అని చెబుతున్నారు. తాను కూడా సినిమాల్లో నటిస్తుంటానని.. తమది ఏడాదిన్నర ప్రేమే అయినప్పటికీ.. తమది అరవై ఏళ్ల బంధంగా అనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పెళ్లికి కేరళ రాష్ట్ర మంత్రి హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. మోనాలిసా పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోనాలిసా తండ్రి నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో వీరు కేరళలోనే ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.