గ్యాస్ కూ బిల్లేసిన హోటల్...వైరల్

admin
Published by Admin — March 13, 2026 in National
News Image

యుద్ధం(war) ఎఫెక్టు మన దేశంలో చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. గ్యాస్(gas) కొరతతో మొదలైన ఇబ్బందులు.. ఈ రోజున దేశంలోని ప్రతి ఇంటిని ప్రభావితం చేస్తోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. టిఫిన్ సెంటర్లు.. టీషాపులు మాత్రమే కాదు.. కర్రీ పాయింట్లు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు కమర్షియల్ సిలిండర్ల మీద ఆధారపడి వ్యాపారం చేసే ప్రతి ఒక్క బిజినెస్ ప్రభావితమైంది. దీంతో.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

సిలిండర్ల కొరత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. బ్లాక్ మార్కెట్ భారీగా పెరిగిపోయిన పరిస్థితి. యుద్ధానికి ముందు వాణిజ్య సిలిండర్ ఒక్కొక్కటి రూ.1600-1800 ఉంటే.. యుద్ధం మొదలైన మూడు రోజులకు రూ.2500లకు చేరుకుంటే.. రెండు రోజుల క్రితం నాటికి రూ.6వేల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో.. పలు హోటళ్లు.. రెస్టారెంట్లు తమ వ్యాపార కార్యకలాపాల్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇదిలా ఉంటే.. కొన్ని సంస్థలు మాత్రం బ్లాక్ లో బండల్ని తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్న పరిస్థితి.

చెన్నైకు చెందిన హోటల్(hotel) ఒకటి.. తన బిల్లులో టిఫిన్ ధరల్ని యథాతధంగా ఉంచేసి.. దానికి గ్యాస్ భారాన్ని అదనంగా మోసిన వైనం ఆసక్తికరంగా మారింది. సదరు బిల్లులో ఇడ్లీ.. వడ ఒక్కో పీస్ తీసుకోగా.. దానికి అదనంగా గ్యాస్ కింద(extra charges for gas) రూ.9.52 వసూలు చేశారు. ఈ మొత్తానికి జీఎస్టీని కలిపి బిల్లు రూ.80గా చూపించారు. గ్యాస్ బండ ధరలు భారీగా పెరిగిన వేళ.. ఈ భారాన్ని వినియోగదారుల మీద మోపిన వైనం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇందులో అంతో ఇంతో కొంత న్యాయం ఉందని చెప్పాలి.

ఎందుకంటే.. యుద్దం కారణంగా పెరిగిన వాణిజ్య సిలిండర్ల ధరల కారణంగా టిఫిన్ ధరల్ని పెంచితే.. నెల ఆగిన తర్వాత యుద్దం ఆగి.. సిలిండర్ల సరఫరా సాధారణ స్థితికి వచ్చినప్పుడు.. పెంచిన టిఫిన్ ధరలు తగ్గించే వీలు ఉండదు. అదే.. ఇలా గ్యాస్ భారాన్ని ప్రతి బిల్లు మీద షేర్ చేయటం ద్వారా.. ఎప్పుడైతే గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వస్తుందో.. అప్పుడు బిల్లు నుంచి గ్యాస్ భారాన్ని తొలగిస్తే సరిపోతుంది. ఒక విధంగా ఇది సరైన చర్యగా కొందరు మద్దతు ఇస్తుంటే.. గ్యాస్ భారాన్ని ఇలా కూడా మోపుతారా? అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags
hotel added gas charges bill Chennai
Recent Comments
Leave a Comment

Related News