`NTR`కు కొత్త అర్థం చెప్పిన చిరంజీవి..!

admin
Published by Admin — March 20, 2026 in Movies
News Image

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినా, ఆ శకానికి ఆదిపురుషుడు నందమూరి తారక రామారావు నేటికీ నటీనటులందరికీ స్ఫూర్తిప్రదాతే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ` గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025` వేదికపై మెగాస్టార్ చిరంజీవికి `ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ` దక్కింది. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా NTR అనే మూడు అక్షరాలకు ఆయన ఇచ్చిన కొత్త నిర్వచనం అందరినీ అబ్బురపరుస్తోంది.

సాధారణంగా ఎన్టీఆర్ అంటే అది ఒక పేరు మాత్రమే కాదు, తెలుగు వారి ఆత్మగౌరవం. అయితే చిరంజీవి ఆ పేరులోని అంతరార్థాన్ని వివరిస్తూ.. `` N అంటే నాట్యం, T అంటే తాళం, R అంటే రాగం`` అని అభివర్ణించారు. ఈ మూడు కలిస్తేనే ఒక పరిపూర్ణమైన కళ అని, ఆ కళా రూపమే రామారావు గారు అని ఆయన కొనియాడారు. కేవలం నటుడిగానే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడి పేరుతో ఈ అవార్డు అందుకోవడం తన జీవితకాల గౌరవమని చిరు ఎమోషనల్ అయ్యారు.

దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ, రామారావు గారు పోషించిన పౌరాణిక పాత్రల ద్వారా మన కళ్ళ ముందే దైవత్వాన్ని ఆవిష్కరించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. `` ఆయన లేని తెలుగు సినిమాను ఊహించలేం. ఆయన పుట్టిందే సినిమా కోసం`` అంటూ ఎన్టీఆర్ పట్ల తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం తనకు లభించడంపై ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కళాకారులను గౌరవించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవను చిరంజీవి ప్రశంసించారు.

Tags
Chiranjeevi NTR National Award Gaddar Awards 2025 Megastar Chiranjeevi Nandamuri Taraka Rama Rao Tollywood
Recent Comments
Leave a Comment

Related News