హస్తిన రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కేంద్ర కేబినెట్‌లో మరో బెర్త్ దక్కనుందనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ పనితీరుకు పదును పెట్టడం, ప్రాంతీయ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీకి అదనపు ప్రాతినిధ్యంపై జరుగుతున్న కసరత్తు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటన ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం రాజధాని వెళ్లిన చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు అర్ధగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో కేవలం మర్యాదపూర్వక అంశాలే కాకుండా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీకి దక్కాల్సిన ప్రాధాన్యతపై లోతుగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగవంతం, రాష్ట్ర పునర్నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక నిధులపై కేంద్రంతో సమన్వయం మరింత బలపడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో టీడీపీ(TDP) తరఫున ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలను హస్తిన వేదికగా మరింత బలంగా వినిపించేందుకు మరో మంత్రి పదవి ఎంతైనా అవసరమని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నిధిని, ప్రాజెక్టును సకాలంలో సాధించుకోవడంలో క్యాబినెట్ హోదా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కార్‌లో ట్రబుల్‌షూటర్‌గా, కీలక మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి మరో మంత్రి పదవి కేటాయించడం ద్వారా రాజకీయ మైత్రీ బంధాన్ని మరింత దృఢం చేసుకోవాలని బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, కేంద్ర కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై పార్టీలోనూ, మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. సీనియర్ నాయకుల అనుభవం, ఎంపీల పనితీరు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలు, జిల్లాల వారీగా సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని అధినాయకత్వం ఈ ఎంపిక చేపట్టే అవకాశం ఉంది. త్వరలోనే ఢిల్లీ(Delhi) నుంచి మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తుండటంతో, ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది.