టాలీవుడ్(Tollywood)లో మాస్ అనే పదానికి పక్కా అడ్రస్ హరీష్ శంకర్. బాక్సాఫీస్ దగ్గర డైలాగులతో తూటాలు పేల్చాలన్నా, కమర్షియల్ మీటర్‌లో మ్యాజిక్ చేయాలన్నా ఆయన స్టైలే వేరు. అయితే, వెండితెరపై ఆయన చూపించే పవర్‌ఫుల్ సినిమాల వెనుక, ఎవరికీ తెలియని ఒక పెద్ద ట్రాజెడీ దాగి ఉందని తాజాగా అర్థమైంది. సాధారణంగా స్టూడెంట్స్‌కి బ్యాక్‌లగ్స్ ఉండటం చూస్తుంటాం, కానీ ఒక స్టార్ డైరెక్టర్ కెరీర్‌లో ఇన్ని బ్యాక్‌లగ్స్ (ఆగిపోయిన సినిమాలు) ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది.
తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో హరీష్ శంకర్(Harish Shankar) తన కెరీర్ లెక్కల గురించి చెబుతూ ఒక షాకింగ్ బాంబు పేల్చారు. ఆయన డైరెక్ట్ చేసి థియేటర్లలోకి వచ్చిన సినిమాలు కేవలం తొమ్మిది మాత్రమే. కానీ, రకరకాల కారణాలతో సెట్స్ వరకు వెళ్లి, మధ్యలోనే ఆగిపోయిన సినిమాల సంఖ్య అక్షరాలా పంతొమ్మిది. ఒక సినిమా ఫ్లాప్ అయితే వచ్చే బాధ కంటే, ప్రాణం పెట్టి రాసుకున్న కథ సెట్స్ పైకి వెళ్లాక ఆగిపోతే వచ్చే వేదన వర్ణనాతీతం. ఇలాంటి అనుభవం హరీష్‌కు ఏకంగా 19 సార్లు ఎదురైందంటే, ఆయన ఓపికకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఒక స్టార్ డైరెక్టర్ సినిమా పట్టాలెక్కాలంటే అన్నీ కుదరాలి. హీరో డేట్స్, ప్రొడక్షన్ లెక్కలు, బడ్జెట్ పరిమితులు.. ఇలా ఏ చిన్న తేడా వచ్చినా ప్రాజెక్ట్ గాలిలో దీపంలా మారుతుంది. హరీష్ శంకర్(Harish Shankar) విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. కొన్ని సినిమాలైతే షూటింగ్ ముహూర్తం దాకా వెళ్లి, రేపు పొద్దున్న కెమెరా ఆన్ అవుతుందనగా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఈ 19 సినిమాల వెనుక ఎంతో కష్టం, మరెంతో రీసెర్చ్ ఉండి ఉంటుంది. ఆ కథలన్నీ గనుక వెండితెరపైకి వచ్చి ఉంటే, హరీష్ శంకర్ రికార్డులు ఈరోజు మరోలా ఉండేవేమో.