చలాన్ల నుంచి త‌ప్పించుకునేందుకు హైటెక్ ప్లాన్‌.. పోలీసుల‌కు మైండ్‌బ్లాక్‌!

admin
Published by Admin — April 12, 2026 in Telangana
News Image

హైదరాబాద్: అతి తెలివి అప్పుడప్పుడు ప్రమాదంలో పడేస్తుంది.. కానీ ఈ కారు యజమాని చేసిన పని మాత్రం పోలీసులనే విస్తుపోయేలా చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, చలాన్ల నుంచి తప్పించుకునేందుకు అతడు వేసిన ప్లాన్ చూసి జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీసులు అవాక్కయ్యారు. వెండితెరపై జేమ్స్ బాండ్ సినిమాల్లో కనిపించే హైటెక్ టెక్నాలజీని వాడుతూ అడ్డంగా బుక్కయ్యాడు.

సాధారణంగా ఎవరైనా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికితే రిక్వెస్ట్ చేస్తారు లేదా సైలెంట్‌గా ఫైన్ కడతారు. కానీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వద్ద శనివారం అర్ధరాత్రి సీన్ మొత్తం రివర్స్ అయింది. పోలీసులు ఒక ఖరీదైన బీఎండబ్ల్యూ(BMW) కారును ఆపి పరీక్షించగా, డ్రైవర్ మద్యం సేవించినట్లు తేలింది. అయితే కారును పక్కకు తీసే క్రమంలో ఒక కానిస్టేబుల్ అనుకోకుండా స్టీరింగ్ వద్ద ఉన్న ఒక సీక్రెట్ బటన్‌ను నొక్కాడు. అంతే.. క్షణాల్లో కారు ముందున్న నంబర్ ప్లేట్ గిర్రున తిరిగిపోయింది.

ఆ ప్లేట్ తిరగడాన్ని చూసిన పోలీసులకు ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. తీరా పరిశీలిస్తే, కారు ముందు భాగంలో ఢిల్లీ(Delhi) రిజిస్ట్రేషన్ నంబర్ (DL 6 CM 7079) ఉంటే, వెనుక వైపు తెలంగాణ నంబర్ (TS 9 FQ 9999) ఉంది. సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ గన్‌ల నుంచి తప్పించుకోవడానికి గౌతమ్ అనే ఈ నిందితుడు ప్రత్యేకంగా ఈ ఫ్లిప్పింగ్ నంబర్ ప్లేట్ సిస్టమ్‌ను అమర్చుకున్నట్లు విచారణలో తేలింది. సిగ్నల్ జంప్ చేసినా, ఓవర్ స్పీడ్‌తో వెళ్లినా బటన్ నొక్కితే చాలు.. నంబర్ మారిపోతుంది, తద్వారా అసలు యజమాని ఎవరో గుర్తుపట్టడం అసాధ్యం.

పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకోవచ్చని భావించిన గౌతమ్ ప్లాన్ ఇప్పుడు అతడిని చిక్కుల్లో పడేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేవలం డ్రంకెన్ డ్రైవ్(Drunken Drive) మాత్రమే కాకుండా.. ఫోర్జరీ, మోసం వంటి సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కారును సీజ్ చేసిన పోలీసులు, అసలు ఈ హైటెక్ టెక్నాలజీని అతనికి ఎవరు అమర్చారు? దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  

Tags
Hyderabad Jubilee Hills Hyderabad Police Cyberabad Telangana News
Recent Comments
Leave a Comment

Related News

Latest News