తీవ్ర విషాదంలో సినీ లోకం.. మెలోడీ క్వీన్ ఆశా భోస్లే ఇక‌లేరు!

admin
Published by Admin — April 12, 2026 in Movies
News Image

ముంబై: భారతీయ సంగీత సామ్రాజ్యంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్ల మందిని ఉర్రూతలూగించిన మెలోడీ క్వీన్, పద్మవిభూషణ్ ఆశా భోస్లే (92) ఆదివారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా వయోభారంతో కూడిన అనారోగ్యం, ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతున్న ఆమె, ముంబై(Mumbai)లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

1943లో ఒక మరాఠీ చిత్రంతో మొదలైన ఆశా భోస్లే(Asha Bhosle) ప్రయాణం, భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం గాయనిగానే కాకుండా, ఒక ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా ఆమె నిలిచారు. క్లాసికల్ నుంచి పాప్ వరకు, జానపదం నుంచి గజల్స్ వరకు.. ఆమె పాడని పాట లేదు, పలకని భావం లేదు. 20కి పైగా భాషల్లో దాదాపు 12 వేలకు పైగా గీతాలను ఆలపించి, అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ చేసిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

భారతరత్న లతా మంగేష్కర్(Lata Mangeshkar) సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకోవడంలో ఆశా భోస్లే సఫలమయ్యారు. అక్క మెలోడీ సాంగ్స్‌తో అలరిస్తే, ఆశా తన 'పెప్పీ' వాయిస్‌తో కుర్రకారును హుషారెత్తించేవారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఆమెను వరించాయి. ఆమె మరణవార్త తెలియగానే చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది.

ఆశా భోస్లే భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఆమె నివాసానికి తరలించారు. రేపు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ(PM Modi) తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. భారతీయ సంగీత ఆకాశంలో ఒక ధ్రువతార నేల రాలిందని, ఆ గొంతు మూగబోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Tags
Asha Bhosle Asha Bhosle Passed Away Legendary Singer RIP Asha Bhosle Bollywood
Recent Comments
Leave a Comment

Related News

Latest News