ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి వారసత్వానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వంగవీటి రంగా అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. అయితే రంగా తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radha Krishna)కు ఇప్పటివరకు కాలం పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. యువ వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఆ తర్వాత ఆయన తీసుకున్న కొన్ని రాజకీయ నిర్ణయాలు ఆయన కెరీర్‌ను ఒడిదుడుకుల్లోకి నెట్టేశాయి. కానీ, ఇప్పుడు సీన్ మారుతోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాధా జరిపిన ఏకాంత భేటీ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ కావడమే కాకుండా, ఆయనకు మంచి రోజులు వచ్చాయని సంకేతాలిస్తోంది.
గత ఎన్నికల సమయంలోనే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ(TDP) కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి కూటమి విజయంలో తనవంతు పాత్ర పోషించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఆయనకు ఎటువంటి నామినేటెడ్ పదవి దక్కకపోవడంతో అనుచరుల్లో కొంత నిరాశ నెలకొంది. గతంలో ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల సమయంలో రాధా పేరు ప్రముఖంగా వినిపించినా, చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోయి అవకాశం చేజారిపోయేది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. సాక్షాత్తు చంద్రబాబే స్వయంగా రాధాను పిలిపించుకుని మాట్లాడటం, ఆ భేటీ తర్వాత రాధా ఎంతో ఉత్సాహంగా కనిపించడం చూస్తుంటే ఆయనకు భారీ పదవి ఖాయమైనట్లు కనిపిస్తోంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం.. వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు(Chandrababu) యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయకుండా, రాజ్యసభకు పంపి కేంద్ర స్థాయిలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా పరిశీలనలో ఉందట. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విపక్షాలు కాపు సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న తరుణంలో, ఆ ప్లాన్‌కు విరుగుడుగా రాధాకృష్ణకు పెద్ద పీట వేయాలని కూటమి సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వంగవీటి రాధా నిరీక్షణకు ఫలితం దక్కే సమయం ఆసన్నమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.