మహిళా రిజర్వేషన్ బిల్లు(women reservation bill) పార్లమెంటుకు చేరడం సంతోషకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(ap deputy cm pawan kalyan) వ్యాఖ్యానించారు. బలమైన కుటుంబాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు.. బలమైన సమాజాన్ని నిర్మించడంలోనూ భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. వారికి సరైన గుర్తింపు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే తాము మహిళా రిజర్వేషన్ కోసం హామీ ఇచ్చామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిం చారు. కారణాలు ఏవైనా.. అది ఇప్పటికైనా ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంపై తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామన్నారు. పార్టీ తరఫునే కాకుండా రాష్ట్రం తరఫున కూడా మహిళలకు ప్రాధాన్యం ఉండాలని సంపూర్ణంగా కోరుకుంటున్నామని చెప్పారు. సమర్థులైన మహిళలకు దేశంలోను, రాష్ట్రంలోను కొదవ లేదన్న ఆయన.. వారికి చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
33 శాతం సీట్లను మహిళలకు కేటాయించడం సరైన చర్చగా పేర్కొన్న పవన్.. వాస్తవానికి ఈ సంఖ్యను మరింత పెంచినా స్వాగతిస్తామన్నారు. కాగా.. ప్రస్తుతం పార్లమెంటుకు చేరిన ఈ బిల్లు.. ద్వారా వచ్చే 2029 నుంచి అమల్లోకి రానుంది. అనంతరం... ఇది 15 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత.. దీనిని పెంచుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా ఇలానే ప్రతిపాదించారు. తొలుత ఈ రిజర్వేషన్లను 25 సంవత్సరాలకు ప్రతిపాదించారు.
తర్వాత.. 70 ఏళ్లుగా వాటిని పొడిగిస్తున్నారు. ఇదే పద్ధతి ప్రస్తుతం బిల్లుకు కూడా కల్పించడం పట్ల పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. అన్నిరంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని.. వారికి రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.